రిలీజ్‌లతో పోటీగా రీరిలీజ్‌లు చేస్తున్న టాలీవుడ్‌కి ఈ మధ్య కొన్ని దెబ్బలు తగిలాయి కూడా. సినిమాలకు అనుకున్నంత స్పందన రాలేదు. అయినా కొంతమంది ఔత్సాహికులు సినిమాల రీరిలీజ్‌ల విషయంలో తమ పట్టు విడువడం లేదు. సినిమాలకు అదనపు హంగులు జోడించి మరీ రిలీజ్ చేసి.. ప్రేక్షకుల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లి అలరించాలని చూస్తున్నారు. గతంలో విజయం సాధించిన సినిమాలను యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తుంటే.. అప్పుడు ఇబ్బందికర ఫలితం అందుకున్నవాటిని ఇప్పుడు తిరిగి తీసుకొచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నారు.
ఈ కోవలోకి మహేష్‌బాబు ‘అతిథి’ సినిమా కూడా చేరింది. మహేష్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘అతిథి’. ఆ రోజుల్లో అంటే సినిమా విడుదలవుతున్న రోజుల్లో దీనిపై భారీ హైపే ఉండింది. అయితే అనూహ్యమైన పరాజయం పాలైంది. సినిమా కథ బాగున్నా స్క్రీన్ ప్లే విషయంలోనే దెబ్బతిన్నారు అనే మాట అప్పుడు వినిపించింది. అందుకేనేమో ఇప్పుడు సినిమాను మరోసారి ఎడిట్ టేబుల్ మీదకు తీసుకొచ్చారని టాక్. మరికాస్త క్లియర్‌గా ఎడిట్ చేయాలని అనుకుంటున్నారట.
అంతేకాదు సినిమా కోసం మరో నేపథ్యం సంగీతం మీద పని చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు సంగీత దర్శకుడు మణి శర్మ మరోసారి రీరికార్డింగ్ మీద దృష్టి పెట్టారట. దాంతోపాటు కొన్ని సీన్స్‌కి పూర్తిగా ట్రాక్‌ను మార్చేస్తున్నారట. ఇక థియేటర్లలో పేలిన సన్నివేశాలను యాజ్ ఇట్ ఈజ్ ఉంచి మిగిలిన సీన్స్‌ను కుదించే ప్లాన్స్‌లో ఉన్నారట. అయితే ఈ పని సురేందర్ రెడ్డి టీమ్ చేస్తోందా? లేక రీరిలీజ్ చేస్తున్నవాళ్లు చేయిస్తున్నారా అనేది చూడాలి.
ఎందుకంటే ఇప్పుడు సురేందర్ రెడ్డి.. పవన్ కల్యాణ్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వక్కంతం వంశీ అందించిన కథను బౌండెడ్ స్క్రిప్ట్ మార్చే ప్రయత్నంలో ఉన్నారట. ఆ పనుల్లో బిజీగా ఉన్న ఆయన ఇప్పుడు మరోసారి ‘అతిథి’ పనులు చూస్తారా/ చూస్తున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. చూద్దాం రీరిలీజ్ మే 29న ఉందిగా.