కేశవ

వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను దక్కించుకొన్న కథానాయకుడు నిఖిల్ నటించిన తాజా చిత్రం “కేశవ”. ఎడమవైపు ఉండాల్సిన హృదయం.. కుడివైపు ఉండే ఓ కుర్రాడి ప్రతీకారమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రానికి సుధీర్ వర్మ దర్శకుడు. ట్రైలర్, పోస్టర్స్ తో విశేషంగా ఆకట్టుకొన్న “కేశవ” సినిమాగా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ:
కేశవ శర్మ అలియాస్ కేశవ (నిఖిల్) ఓ బ్రాహ్మణ యువకుడు. లా చదువుతుంటాడు. తన తల్లిదండ్రులను అకారణంగా చంపేసిన పోలీసులను చంపి పగ తీర్చుకోవడమే కేశవ ధ్యేయం. అయితే.. అందరికీ ఎడంవైపు ఉండే గుండెకాయ కేశవను కుడివైపు ఉన్న కారణంగా.. హత్య చేసేప్పుడు కూడా ఏమాత్రం టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండాలి.
మరి అంత ప్రశాంతంగా ఎలా హత్యలు చేశాడు, తన లిస్ట్ లో ఉన్న పోలీసులందర్నీ చంపాడా, లేదా? ఈ పగ తీర్చుకొనే సమయంలో కేశవ ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “కేశవ” కథాంశం.

నటీనటుల పనితీరు:
నిఖిల్ సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకొందామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అతనికి గుండె కుడివైపు ఉండడం వల్ల అలా బిహేవ్ చేస్తున్నాడని అనుకొందాం అనుకొన్నా.. ఒకటీ ఆరా సన్నివేశాల్లో తప్ప ఎక్కడా హీరోగారు గుండె సమస్య ఉన్నట్లుగా వ్యవహరించకపోవడంతో “రైట్ సైడ్ హార్ట్ ఇష్యూ” ఏ విధంగానూ ఉపయోగపడలేదు.
రీతువర్మ క్యారెక్టర్ ను సరిగా డిజైన్ చేయలేదు, ఎప్పుడో చిన్నప్పటి స్నేహితురాలైన యువతి పన్నెండేళ్ళ తర్వాత కలిసిన కుర్రాడికి ఎందుకు సహాయపడుతుంది, అది కూడా వరుస హత్యలకు. పోనీ ప్రేమ అనుకొందామంటే.. వారిద్దరి నడుమ ప్రేమ ఉన్నట్లు లాస్ట్ ఫ్రేమ్ తో తప్ప ఎక్కడా సరిగా ఎలివేట్ చేయలేదు. సో, అమ్మడు అందంగా అలంకరించుకొని కనువిందు చేయడానికి మినహా పెద్దగా సినిమాకి ఉపయోగపడలేదు.
“పెళ్ళిచూపులు” ఫేమ్ ప్రియదర్శి, వెన్నలకిషోర్ ల కామెడీ అంతగా పేల్లేదు. సత్య మాత్రం తన కామెడీ టైమింగ్ తో ఉన్న కాసేపు అలరించాడు.
ఇషా కొప్పికర్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా లుక్ ప్రకారం ఆకట్టుకొంది కానీ.. యాక్షన్ విషయంలో పర్వాలేదనిపించుకొంది. అమ్మడికి అనసూయ చెప్పిన డబ్బింగ్ కూడా అలరించలేదు.
రావు రమేష్ క్యారెక్టరైజేషన్ “ఒన్ నేనొక్కడినే” చిత్రంలో నాజర్ పాత్రను తలపిస్తుంది. కానీ.. సరైన జస్టిఫికేషన్ లేని కారణంగా క్లారిటీ లేని క్యారెక్టర్ గా మిగిలిపోతుంది.

సాంకేతికవర్గం పనితీరు:
సన్నీ ఎం.ఆర్ ఎప్పట్లానే ఫ్యూజన్ మిక్స్ మ్యూజిక్ తో ఆకట్టుకోవడానికి విశ్వప్రయత్నం చేశాడు. “తెలుసా నీకు బహుశా” పాట బాగుంది. ఇక “కాలభైరవ అస్తకం” పాట “ఒన్ ఆఫ్ ది బెస్ట్ ఇంటెన్స్ సాంగ్”గా నిలిచిపోతుంది. ఆ పాటను సన్నివేశానికి తగ్గట్లుగా వాడుకొన్న విధానమూ అదరహో అనిపించే స్థాయిలో ఉంది.
ప్రశాంత్ పిళ్లై బ్యాగ్రౌండ్ స్కోర్ కథను, కథలోని ఇంటెన్సిటీని విశేషమైన రీతిలో రిప్రెజంట్ చేసింది.
దివాకర్ మణి సినిమాటోగ్రఫీ వర్క్ ఈ సినిమా ప్రాణం. ఏరియల్ షాట్స్ కి గ్రే బ్రౌన్ టింట్ ఎఫెక్ట్ యాడ్ అవ్వడంతో.. విజువల్స్ పరంగా “కేశవ” సినిమా లవర్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ లో పెట్టిన ఫోకస్ పుల్లింగ్ షాట్ సినిమాకి హైలైట్.
అన్నీ బాగున్నాయి కానీ.. ఎడిటింగ్ సినిమాకి మైనస్ గా నిలిచింది. సీన్ టు సీన్ కనెక్టివిటీ మిస్ అయ్యింది.

గోపీచంద్ నటించిన “ఒక్కడున్నాడు” సినిమా చూస్తే.. అందులో “ముంబై బ్లడ్ గ్రూప్” ఉన్న ఓ కుర్రాడి గుండె కోసం కథ తిరుగుతుంది. ప్రతి సన్నివేశంలో ఆ హార్ట్ ఇష్యూని హైలైట్ చేస్తుంటారు.
కానీ.. “కేశవ”లో ఎక్కడా ఆ ఇష్యూని సరిగా యూటిలైజ్ చేసుకోలేదు సరికదా అసలు హీరోగారు చేసే ఫైట్లు, లాంగ్ జంప్ లు, హై జంప్ లు చూస్తే.. “అసలు మనోడికి హార్ట్ ప్రోబ్లమ్” ఉందా అని సగటు ప్రేక్షకుడికి అనుమానం రాకమానదు. సో, ఒక దర్శకుడిగా సుధీర్ వర్మ టేకింగ్ విషయంలో సక్సెస్ అయ్యాడే కానీ.. ఒక కథకుడిగా మాత్రం “కేశవ”తో దారుణంగా విఫలమయ్యాడు.

విశ్లేషణ:
ఈమధ్య దర్శకులు కథలో ట్విస్టుల మీద పెడుతున్న కాన్సన్ ట్రేషన్ ఆ ట్విస్టులను సరైన టైమ్ లో రివీల్ చేయడం మీద పెట్టట్లేదు. అంటే స్క్రీన్ ప్లేను పెద్దగా పట్టించుకోవడం లేదు. కథలో ఎన్ని కొత్త రోగాలున్నా.. కథనంలో కొత్తదనం లేనిదే సినిమా ఆడదు కదా. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మన దర్శకుడు కొత్త కొత్త రోగాలతోపాటు సరికొత్త స్క్రీన్ ప్లేను కూడా సిద్ధం చేసుకొంటే మంచిది. ఒక్క ముక్కలో “కేశవ” సినిమా గురించి చెప్పాలంటే.. ట్రైలర్ లో ఉన్న ఇంటన్సిటీ సినిమాలో లేదు.

రేటింగ్ : 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus