దర్శకుడు ఓదెల శ్రీకాంత్ సోదరుడు శశి ఓదెల, నాని సినిమాల హీరో దీక్షిత్ శెట్టి, యంగ్ హీరోయిన్ యుక్తి తరేజా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘కేజేక్యూ’ (కింగ్ జాకీ క్వీన్ అనేది పూర్తి పేరు). ఈ సినిమాను స్వర్గీయ కిరణ్ కుమార్ మీనుగ అలియాస్ కేకే తెరకెక్కించారు. ఆయన గతేడాది డిసెంబర్ 17న అస్వస్థత గురై తుదశ్వాస విడిచారు. దీంతో ఆ సినిమా రాదేమో అని అనుకున్నారంతా. కానీ శ్రీకాంత్ ఓదెల, నిర్మాత సుధాకర్ చొరవతో సినిమా ఆగస్టు 7న విడుదలవుతోంది.
ఈ సందర్భంగా స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా కోసం ముందుకు వచ్చారు. సినిమా ప్రధాన తారాగణంతో ఓ ఇంటర్వ్యూ చేశారు. ఈ క్రమంలో ఈ సినిమా కథ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా కథ గురించి దర్శకుడు కేకే 15 ఏళ్ల క్రితమే తనకు చెప్పాడని సందీప్ తెలిపారు. తాను ‘కేడీ’ సినిమాకు అసిస్టెంట్ డైరక్టర్‌గా పని చేస్తున్నప్పుడు కేకే ఈ కథ గురించి తన దగ్గర ప్రస్తావించారని తెలిపారు.
అప్పట్లో ఈ సినిమాలో అనుష్క శెట్టిని లీడ్‌గా అనుకున్నారట. కానీ అప్పట్లో కుదర్లేదు అని చెప్పారు. ఇప్పుడు సినిమాను కొత్త వాళ్లతో చేశారని, అలా ఒక సినిమా ప్రేక్షకులకు చూపించడానికి పది సంవత్సరాలు పట్టిందని గుర్తు చేశారు. దీంతో అప్పట్లో అనుష్క ఈ సినిమా చేసి ఉంటే ఎలా ఉండేది అంటూ అభిమానులు ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. అలాగే అనుష్కతో పాటు నటించే ఆ ఇద్దరు హీరోలు ఎవరై ఉండొచ్చు అనే చర్చ కూడా జరుగుతోంది.
సినిమా రిలీజ్ అయ్యాక ఫలితం బట్టి ఈ డిస్కషన్స్ ఇంకా పెరుగుతాయి అని చెప్పాలి. సినిమాకు మంచి ఫలితం వస్తుందనే అంచనాలు ఉన్నాయి. అలా వస్తే.. అప్పట్లో అనుష్క మంచి సినిమా మిస్ అయింది అనే డిస్కషన్స్ కూడా జరుగుతాయి..