మంచి సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత వరుస ఒడుదొడుకులు పడ్డ హీరో కిరణ్ అబ్బవరం. వీటిని రెండు వరుస విజయాలతో దాటుకొని తనేంటో, తన సత్తా ఏంటో నిరూపించాడు. దీంతో ఇప్పుడు ప్రాజెక్టుల విషయంలో కొంచెం ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అదే సమయంలో తన ఫిల్మోగ్రఫీలో వైవిధ్యం మిస్ కాకూడదని కూడా అనుకుంటున్నాడు. ఈ క్రమంలో ఓ వెబ్ సిరీస్‌కి పచ్చ జెండా ఊపాడు అని సమాచారం. ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది కూడా. దీనికి పేరు కూడా పెట్టేశారు అని చెబుతున్నారు.
విజయ్ దేవరకొండ, రష్మిక మందన ‘డియర్ కామ్రెడ్’ సినిమా దర్శకుడు భరత్ కమ్మ ఆధ్వర్యంలో ఈ వెబ్ సిరీస్ సిద్ధమవుతోందని సమాచారం. త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేసే ఉద్దేశంలో టీమ్ ఉందట. ఇక ఈ సిరీస్‌కు ‘గువ్వల చెరువు ఘాట్’ అనే పేరు పెడుతున్నారట. ఉమ్మడి కడప జిల్లాలో ఉన్న శేషాచలం కొండల్లో ‘గువ్వలచెరువు ఘాట్’ అనేది ఉంది. ఆ లెక్కన ఈ సిరీస్ కడప నేపథ్యంలోనే ఉంటుందని అర్థం చేసుకోవచ్చు. కిరణ్ అబ్బవరం సొంతూరు కడప (ఇప్పుడు అన్నమయ్య) జిల్లా పెద్ద కొడివండ్లపల్లి. ఇక సిరీస్ పేరు, నేపథ్యం ఉన్న ‘గువ్వల చెరువు ఘాట్’ వారి సొంతూరుకి గంట దూరంలో ఉంది.
ఇక కిరణ్ చేతిలో ఉన్న ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందట. ఇది కాకుండా ‘క 2’ సినిమా చేస్తారని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే ఆ మధ్య నిర్మాత మాట్లాడుతూ ‘క 2’ ఉంటుంది కానీ హీరో మారొచ్చు అని చెప్పారు. కాబట్టి క్లారిటీగా ఆ సినిమా ఉందని చెప్పలేం. ఇక ‘పుష్ప’ సినిమాలకు సుకుమార్ దగ్గర డైరక్షన్ టీమ్‌లో చేసిన వీరా కొగటం దర్శకత్వంలో కిరణ్ ఓ సినిమా చేయాలి. ఆ మద్య అనౌన్స్‌మెంట్ అన్నారు కానీ ఇంకా రాలేదు.