కోట శ్రీనివాసరావు టాలీవుడ్ లో ఉన్న అద్భుత నటులలో ఈయన ప్రత్యేకం. ఈయన చేసిన పాత్రలు అలాంటివి. ‘ఆహ నా పెళ్ళంట’ ‘ఆమె’ వంటి చిత్రాలలో ఈయన నటన ఎప్పటికీ మరచిపోలేము అనడంలో అతిశయోక్తిలేదు. ఈయన క్రేజ్ అంచలంచలుగా పెరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు ఆయనకి అవకాశాలు రావడం లేదు. ఇటీవల వచ్చిన ‘మహర్షి’ ‘ఎబిసిడి’ ‘సీత’ వంటి చిత్రాలలో గెస్ట్ రోల్స్ మాత్రమే దక్కాయి. దర్శకులు పూర్తిగా కోటా శ్రీనివాసరావు ను పక్కన పెట్టేస్తున్నారు. అందుకే ఆయనకి కోపం వచ్చినట్టుంది తాజాగా… టాలీవుడ్ దర్శకుల పై ఆయన మండిపడుతూ కామెంట్స్ చేసి తన ఆవేదన వ్యక్తం చేశాడు.
కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ… “గత 30 ఏళ్ళుగా రోజుకు 20 గంటలు పని చేస్తూ వచ్చిన నాకు ఇప్పుడు ఖాళీగా ఉండటం అస్సలు నచ్చడం లేదు. నన్ను ఎందుకు పట్టించుకోవడం లేదో.. అసలెందుకు అవకాశాలు ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. నాకు వయసు అయిపోయిందని.. ఇక నడవలేకపోతున్నానని ముందే నిర్ణయించుకుని నన్ను పక్కనబెట్టేసారేమో. నేను ఇప్పటికీ బాగానే ఉన్నాను. కాళ్ళ నొప్పులు ఉన్న మాట నిజమే కానీ నేను బాగానే నడవగలుగుతున్నాను. ఈ మాత్రం దానికే నన్ను పూర్తిగా ఇంటికే పరిమితం చేస్తారని అనుకోలేదు. డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు కనీసం వేషాలు ఇవ్వండ్రా నాయనా…! నాకు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అస్సలు నచ్చడం లేదు. అందుకే ఇలా మాట్లాడుతున్నాను.. తప్పుగా అనుకోకండి” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసాడు.