ప్రభాస్ హీరోగా ‘ఆదిపురుష్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేశారు. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ముంబైలో భారీ సెట్ వేశారు. ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేశారు. కొన్ని రోజుల గ్యాప్ తరువాత మరో షెడ్యూల్ చేద్దామనుకున్న సమయంలో మహారాష్ట్రలో కేసులో పెరగడంతో.. ప్రభుత్వ ఆంక్షలు విధించింది. దీంతో షూటింగ్ ఆగిపోయింది. అలా ఆగిపోయిన షూటింగ్ ను ఇప్పుడు మరోసారి మొదలుపెట్టాలని మేకర్లు నిర్ణయించుకున్నారు .
మహారాష్ట్రలో పరిస్థితులు అంతగా బాలేవు కాబట్టి.. కుదిరితే హైదరాబాద్ లో ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే వారం హైదరాబాద్ లో ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. దీనికి ప్రభాస్ తో పాటు కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువ ఉంటుంది. దాదాపు షూటింగ్ మొత్తం ఇండోర్ లోనే జరుగుతుంది. కాబట్టి సరైన జాగ్రత్తలు తీసుకుంటే..
ఈ కరోనా సమయంలో షూటింగ్ చేయడం సమస్య కాదని యూనిట్ భావిస్తోంది. ‘ఆదిపురుష్’ సినిమాకి సంబంధించి మరో 90 రోజుల షూటింగ్ పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే వారం నుండి షూటింగ్ మొదలుపెడితే అనుకున్న సమయానికి కాస్త అటు, ఇటుగా సినిమాను సిద్ధం చేయొచ్చని దర్శకుడు భావిస్తున్నాడు. అయితే కరోనా భయంతో అందరూ షూటింగ్ లు వాయిదా వేసుకుంటే.. ‘ఆదిపురుష్’ యూనిట్ మాత్రం కొత్త షెడ్యూల్ కోసం ప్లాన్ చేయడం హాట్ టాపిక్ గా మారింది!