Krishnaveni: ఎన్టీఆర్ – ఘంటసాలకు మొదటి ఛాన్స్ ఇచ్చిన సీనియర్ నటి, నిర్మాత కృష్ణవేణి కన్నుమూత!

Ad not loaded.

తెలుగు చిత్రసీమకు ఎనలేని కీర్తి తెచ్చిపెట్టిన ప్రముఖ నటి, నిర్మాత కృష్ణవేణి ఇకలేరు. 102 సంవత్సరాల వయస్సులో ఆమె కన్నుమూశారు. వయోభార సమస్యలతో కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న కృష్ణవేణి ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. సినీ పరిశ్రమకు గొప్ప వ్యక్తులను అందించిన గౌరవప్రదమైన నిర్మాతగా ఆమె మంచి గుర్తింపు అందుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నిర్మాతగా ఆమె చిరస్మరణీయంగా నిలిచారు.

Producer, Actress Krishnaveni

అంతేగాక, తెలుగునాట లెజెండరీ సంగీత దర్శకుడు ఘంటసాలకు కూడా తొలి అవకాశం ఇచ్చిన ఘనత ఆమెదే. పశ్చిమ గోదావరి జిల్లా పంగిడిలో జన్మించిన కృష్ణవేణి, చిన్నతనం నుంచే నటనపై ఆసక్తితో నాటక రంగంలో ప్రవేశించారు. 1936లో అనసూయ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినీరంగంలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

నటిగా మాత్రమే కాదు, నేపథ్య గాయనిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె పాటలు ఆ రోజుల్లో ప్రేక్షకులను అలరించేవి. సినీరంగంపై మక్కువతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, మన దేశం అనే చిత్రాన్ని నిర్మించారు. 1949లో విడుదలైన “మన దేశం” సినిమాతో ఎన్టీఆర్ తొలిసారి వెండితెరపై కనిపించారు. చిన్న పాత్ర అయినా, అది ఆయన జీవితాన్ని మార్చేసిన అవకాశం. ఆ సినిమా విజయవంతమై, ఎన్టీఆర్‌ను స్టార్ హీరోగా పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించింది.

అంతేకాదు, ఘంటసాలను సంగీత దర్శకుడిగా నిలబెట్టడంలో కూడా కృష్ణవేణి అత్యంత ముఖ్యమైన వ్యక్తిగా నిలిచారు. ఆమె నిర్మించిన సినిమాలు అప్పట్లోనే సినీ పరిశ్రమలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచాయి. కృష్ణవేణి జీవిత ప్రయాణం ఒక్క నటిగానే కాదు, నిర్మాతగా, గాయనిగా కూడా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవలందించిన ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు. సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు నివాళులు అర్పిస్తూ, ఆమె చేసిన సేవలను స్మరించుకుంటున్నారు.

నేనింకా ఆయనకు గుర్తున్నా.. నాకే ఆశ్చర్యమేసింది: రజనీ హీరోయిన్‌!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus