లై

“అ ఆ” లాంటి డీసెంట్ హిట్ అనంతరం నితిన్ కథానాయకుడిగా, “కృష్ణగాడి వీరప్రేమగాధ” అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “లై”. అర్జున్ విలన్ గా నటించిన ఈ చిత్రంలో మేఘ ఆకాష్ కథానాయకి. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఎ.సత్యం (నితిన్) హైద్రాబాద్ ఓల్డ్ సిటీలో జులాయిగా తిరిగుతూ ఖర్చుల కోసం పర్సులు కొట్టేయడం చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ గడిపేసే యువకుడు. చైత్ర (మేఘ ఆకాష్) పుట్టు పిసినారి, కేవలం అమెరికాలోని అందమైన ప్రదేశాలు చూడడం కోసం పెళ్లి ఒప్పేసుకొని, తాళి కట్టించుకోడానికి రెడీ అయిపోతుంది. ఆఖరి నిమిషంలో పెళ్లి ఆగిపోవడంతో.. అప్పటికే ట్రావెల్ ఏజెంట్ కు కట్టేసిన ట్రిప్ డబ్బులు వెనక్కి రావని తెలిసి అమెరికా పయనమవుతుంది. వీరిద్దరూ అనుకోనివిధంగా కలిసి ప్రయాణం చేయాల్సి వస్తుంది. కట్ చేస్తే.. ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో 19 ఏళ్లగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న ఓ పేరు-రూపు కూడా తెలియని డేంజరస్ విలన్ కోసం వెతుకుతుంటుంది. సత్యం మరోసారి అనుకోకుండా ఇండియన్ ఇంటిలిజెన్స్ కారణంగా సదరు గుర్తు తెలియని డేంజరస్ విలన్ తో తలపడాల్సి వస్తుంది. ఇంతకీ ఆ డేంజరస్ విలన్ ఎవరు? సత్యంకి ఇంటెలిజన్స్ బ్యూరోతో ఉన్న సంబంధం ఏమిటి? చివరికి అతడు దొరికాడా లేదా అనేది “లై” కథాంశం.

నటీనటుల పనితీరు : నితిన్ ఈ సినిమాలో స్టైలిష్ గా డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో బాగానే నటించాడు కానీ.. హీరోని ఇంటెలిజింట్ గా చూపించాలా లేక ఇంటెలిక్చ్యువల్ గా చూపించాలా అనే క్లారిటీ లేకపోవడంతో నితిన్ పాత్ర మాత్రమే కాక అతడి వ్యవహారం కూడా చాలా సన్నివేశాల్లో అర్ధం కాదు. ఇక హీరోయిన్ మేఘ ఆకాష్.. చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి తక్కువ అన్నట్లుగా అటు అందంగానూ లేక ఇటు అభినయ సామర్ధ్యమూ లేక ఆడియన్స్ కు చిరాకుపుట్టించింది. అర్జున్ పాత్ర “దుబాయ్ శీను, అతిధి” చిత్రాల్లోని విలన్ పాత్రను తలపిస్తుంది. అయితే.. పోలీసులు అతడి గురించి చెప్పినంత గొప్పదనం కానీ తెలివితేటలు కానీ అతడి పాత్ర వ్యవహారంలో కనిపించవు. పైగా.. సినిమాలోని ట్విస్టులన్నీ ఆడియన్స్ హీరో కంటే ముందే ఊహించేయడంతో.. అర్జున్ పవర్ ఫుల్ విలన్ లా కాకుండా కమెడియన్ లా కనిపిస్తుంటాడు. మధునందన్ కామెడీ కొన్ని సన్నివేశాల్లో పర్లేదు కానీ.. పెద్దగా నవ్వించలేకపోయింది. నాజర్, రవికిషన్, శ్రీకాంత్ (తమిళ నటుడు) లాంటి సీజన్డ్ ఆర్టిస్టులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

సాంకేతికవర్గం పనితీరు : మణిశర్మ మరోమారు తనదైన శైలి నేపధ్య సంగీతంతో విశేషంగా ఆకట్టుకొన్నాడు. పాటలు వినడానికి బాగున్నంతగా.. చూడ్డానికి బాగోకపోవడంతో విజువల్ గా సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు కానీ.. సౌండ్ డిజైనింగ్, మిక్సింగ్ లో మణిశర్మ చూపిన జాగ్రత్త ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు విన్న ప్రతి మ్యూజిక్ లవర్ కి అర్ధమవుతుంది. యువరాజ్ సినిమాటోగ్రఫీ సినిమా మెయిన్ ఎస్సెట్. అయితే.. ట్రైలర్ లో కనిపించినట్లుగా ఎల్లో గ్రేడింగ్ సినిమాలో కనిపించదు. కాకపోతే అమెరికాలోని చాలా సుందర ప్రదేశాలను అంతే అందంగా స్క్రీన్ పై ప్రెజంట్ చేశాడు యువరాజ్. అలాగే.. క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించిన విధానమూ బాగుంది.

ప్రొడక్షన్ వేల్యూస్ సినిమాకి మెయిన్ ఎస్సెట్. దర్శకుడు కోరిన విధంగా ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఖర్చుపెట్టిన నిర్మాతల ధైర్యాన్ని మెచ్చుకొని తీరాలి. దర్శకుడు హను రాఘవపూడి రాసుకొన్న కథలో ఉన్న నవ్యత, ఆ కథను నడిపించే కథనంలో చూపలేకపోయాడు. తన తెలివితేటలన్నీ పాత్రల వ్యవహారశైలిపై చూపించాడే కానీ.. సదరు పాత్రలను ఆడియన్స్ ఓన్ చేసుకోకపోయినా కనీసం అర్ధం చేసుకొనే విధంగా కూడా ప్రెజంట్ చేయలేకపోయాడు. అనవసరమైన లీంక్స్, ట్విస్ట్స్ ఎక్కువయ్యాయి, దాంతో ఆడియన్స్ సినిమాని ఎక్కువగా ఎంజాయ్ చేయడం పక్కన పెడితే.. ఉన్నట్లుంది కథనం నుండి డిస్కనక్ట్ అవుతుంటారు. సినిమా స్టైలిష్ గా తీసారా, ఎలాంటి లొకేషన్స్ లో తీశారు అనే విషయం కంటే.. ఎంత అర్ధవంతంగా తీశాడు అనేది ముఖ్యం. హను మునుపటి చిత్రం “కృష్ణగాడి వీరప్రేమగాధ” విజయంలో కీలకపాత్ర పోషించిన ఈ విషయాన్ని హను పట్టించుకోకపోవడం గమనార్హం.

విశ్లేషణ : దర్శకుడి తెలివి సినిమాలో కాదు సినిమాలోని పాత్రల్లో కనపడాలి. అలా కాదని సినిమా మొత్తం తెలివితో నింపేసి, పాత్రధారుల గురించి పట్టించుకోకపోతే ఎలా ఉంటుంది అనే విషయానికి “లై” నిదర్శనం. హను కచ్చితంగా “ఒన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్ ఇన్ తెలుగు సినిమా”. కానీ.. “లై” సినిమాలో తాను స్వయంగా రాసిన “బలహీనత లేని బలవంతుడ్ని భగవంతుడు కూడా సృష్టించలేదు” అనే డైలాగ్ ను దృష్టిలో ఉంచుకొని తనలోని బలహీనతను ఎరిగి తన తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తలు తీసుకొంటాడని ఆశిద్దాం.

రేటింగ్ : 1.5/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus