2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!

సంగీతానికున్న బలం, గుణం ఈ ప్రపంచంలో ఏ శక్తికీ లేదు. నీ మనసులో ఎన్ని సమస్యలు మెదులుతున్నా ఒక మంచి పాట రెండు నిమిషాలు వినగానే ఆ ఆలోచనలకు కనీసం ఒక్క నిమిషం అయినా బ్రేక్ వేసి పాటను ఆస్వాదిస్తాం. ఇక సినిమాల్లో పాటలది విదీయలేని బంధం. ఇప్పుడంటే పాటలు లేకుండా సినిమాలంటే బెటర్ అని ప్రేక్షకుడు ఆలోచిస్తున్నాడు అది కూడా కొందరు రొడ్డకొట్టుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రిపీటెడ్ ట్యూన్స్ వల్ల. లేకపోతే.. కేవలం పాటల వల్లే హిట్ అయిన సినిమాలు కోకొల్లలు. అందుకే.. ఈ ఏడాది మనల్ని విశేషంగా ఆకట్టుకున్న, అలరించిన కొన్ని పాటలు ఏమిటో చూద్దాం. మేము ఏదైనా పాట మిస్ అయితే.. కామెంట్ బాక్స్ లో కారణంతో సహా తెలియజేయగలరు.

1.సామజవరగమన (అల వైకుంఠపురములో)

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ నెంబర్ ఈ పాట అనడంలో ఎలాంటి సందేహం లేదు. విడుదలైన 30 సెకన్ల టీజరే సంచలనం సృష్టించింది. సిరివెన్నెల సాహిత్యం, తమన్ సంగీతం పాటకు ప్రాణం పోశాయి. సిద్ శ్రీరామ్ తెలుగు ఇంకాస్త స్పష్టంగా పలికి ఉంటే బాగుండేది కానీ.. ప్రెజంట్ జనరేషన్ లో ఎంత తక్కువ స్పష్టత ఉంటే అంత పెద్ద హిట్ కాబట్టి.. ఆ అక్షర దోషాలను పెద్దగా పట్టించుకోలేదు ఎవరూ. ప్రేయసిని ఇంత ముద్దుగా కూడా వేడుకోవచ్చని శాస్త్రిగారు రాసిన విధానం మాత్రం భలే ముద్దుగా ఉంటుంది.

2.మైండ్ బ్లాక్ (సరిలేరు నీకెవ్వరు)

మహేష్ బాబు నిల్చున్న చోటే కదలకుండా ఫైట్లు చేస్తాడు, డ్యాన్స్ విషయంలో అయితే నాన్న కృష్ణగారిని ఫాలో అయిపోతాడు అని హేళన చేసినవాళ్ళందరికీ సమాధానం “మైండ్ బ్లాక్”. దేవిశ్రీప్రసాద్ సంగీత సారధ్యంలో తెరకెక్కిన ఈ గీతం వినడానికి ఓ మోస్తరుగా ఉన్నా.. మహేష్ లుంగీ కట్టి వేసిన స్టెప్పులకు మాత్రం థియేటర్లు దద్దరిల్లాయి. మహేష్ కెరీర్ లోనే కాదు ఆయన ఫ్యాన్స్ కూడా ఎప్పటికీ మరువలేని బిగ్గెస్ట్ మాస్ నెంబర్ సాంగ్ ఇది.

3.బుట్టబొమ్మ (అల వైకుంఠపురములో)

ఈ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నిజానికి ఈ పాట ప్రోమో విడుదలైనప్పుడు కానీ, ఫుల్ సాంగ్ విడుదలైనప్పుడు కానీ పెద్దగా బజ్ క్రియేట్ అవ్వలేదు. అందరూ సామజవరగమన మాయలో ఉన్నారు. కానీ ఎప్పుడైనా బన్నీ సిగ్నేచర్ స్టెప్ తో వీడియో రిలీజ్ అయ్యిందో ఒక్కసారిగా ఊపందుకొంది. డేవిడ్ వార్నర్ ఈ పాటపై టిక్ టాక్ లు చేయడమే కాక.. మొన్న ఒక మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తూ కూడా ఈ సాంగ్ సిగ్నేచర్ స్టెప్ ను ఫీల్డ్ లో వేసాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఈ పాట జనాలకి ఏ స్థాయిలో రీచ్ అయ్యిందో. అర్మాన్ మాలిక్ గాత్రానికి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం ప్రత్యేకతను తీసుకొచ్చింది. ప్రేమను బబుల్ గమ్ తో పోల్చడం అనేది యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అలాగే.. వీడియో సాంగ్ లో నిజంగానే బుట్టబొమ్మలా ఉండే పూజా హెగ్డే కూడా ఒక ప్రత్యేకమైన ఆకర్షణ.

4.నువ్వు నాతో ఏమన్నావో (డిస్కో రాజా)

గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం చివరిగా పాడిన పాటల్లో ఇదొకటి. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యానికి, తమన్ సంగీతం తోడై సంగీత మాయా ప్రపంచాన్ని సృష్టిస్తే.. ఈ రెంటికీ ఊపిరి పోసింది బాలు గారి గాత్రం. రెట్రో సాంగ్ అవ్వడం, బాలు గారి సింగిల్ వోకల్ అవ్వడంతో.. ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉంటుంది.

5.ఫ్రీకవుట్ (డిస్కో రాజా)

సినిమాకి మంచి ఎనర్జీ తీసుకొచ్చిన పాట ఇది. అసలు ట్రైలర్ కూడా రిలీజ్ చేయకుండా కేవలం ఈ పాట రిలీజ్ చేసేసరికి టికెట్స్ బుక్ అయిపోయాయి. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిందీ సాంగ్. వీడియోగా మాత్రం ఆకట్టుకోలేదు అది వేరే విషయం అనుకోండి.

6.ప్రాణం (జాను)

పాడిన చిన్మయి, గౌతమ్ భరద్వాజ్ లకంటే ముందు రాసిన శ్రీమణిని మెచ్చుకోవాలి. ఒక ప్రేమిక మనసును పేపర్ పై పరిచేసాడు. ప్రతి పదంలో భావం, ప్రతి చరణంలో జీవం ఉట్టిపడుతుంటాయి. గోవింద్ వసంత సంగీతం కూడా బాగుంటుంది. వింటున్నంతసేపు వేరే ప్రపంచంలో తేలియాడుతున్న భావన కలిగించే పాట ఇది.

7.లైఫ్ ఆఫ్ రామ్ (జాను)

ఒక ఒంటరి వ్యక్తి, తనను వదిలేసి వెళ్ళిపోయిన ప్రేయసిని తలుచుకుంటూ సాగించే ప్రయాణం ఇంత అందంగా ఉంటుందా అనిపించేలా ఈ పాటను రాశారు సిరివెన్నెల శాస్త్రిగారు. “నా వెంట పడి నువ్వింత ఒంటరి అనవద్దు అనొద్దు దయుంచి ఎవరూ.. ఇంకొన్ని జన్మాల కి సరిపడు అనేక స్మృతుల్ని ఇతరులు ఎరగరు” ఈ ఒక్క పల్లవిలో ఒంటరి ప్రేమికుడి అంతరంగాన్ని చెప్పేసారు గురువుగారు. చిత్రీకరణ కూడా అంతే అందంగా ఉంటుంది.

8.ఉండిపోవా (సవారి)

అప్పటికి ఈ పాట చాలాసార్లు విని బాగుంది అనుకున్నాను కానీ.. ఏ సినిమాలోది అనేది రిజిష్టర్ అవ్వలేదు. సవారి సినిమా థియేటర్లో చూసాక తెలిసింది ఈ సినిమాలోది అని. సాహిత్యం పరంగానూ గొప్పగా ఉంటుంది పాట. ఒకమ్మాయి మనస్ఫూర్తిగా ఒకబ్బాయిని ప్రేమిస్తే ఏ విధంగా వ్యక్తపరుస్తుందో బాగా ప్రెజంట్ చేసారు లిరిక్ రైటర్ పూర్ణా చారి. శేఖర్ చంద్ర సంగీతం, స్ఫూర్తి జితేందర్ గాత్రం శ్రోతలను ఆకట్టుకున్నాయి.

9.బొగ్గు గనిలో (వరల్డ్ ఫేమస్ లవర్)

అప్పటివరకు విజయ్ దేవరకొండ చేసిన సినిమాల మీద, పనుల మీద లేదా అతడి సినిమా టైటిల్స్ మీద మాత్రమే మీమ్స్ వచ్చాయి. మొదటిసారి పాట ఎనౌన్స్ మెంట్ పోస్టర్ మీద కూడా మీమ్స్ వచ్చాయి. అంత రచ్చ చేసింది “బొగ్గు గనిలో” అనే పదం. రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, నిరంజ్ సురేష్ గాత్రం భలే గమ్మత్తుగా ఉంటాయి. గోపీ సుందర్ ట్యూన్ వినసొంపుగా ఉంటుంది.

10.రాలెట్టి (వరల్డ్ ఫేమస్ లవర్)

“తగిలే పొడి పొడి మాటలకే.. పగిలే తెలతెల్లని మనసేలే. పోగేసి ముక్కలన్నీ అతికించి చూసిన” ఈ పల్లవిలో సగటు గృహిణి మనసును అందరికీ అర్ధమయ్యేలా రాసిన శ్రేష్ఠకి ధన్యవాదాలు. ఒక ఆడదాని మనసు ఎంత సున్నితమో, అలాగే ఎంత ధృడమో తెలియజెప్పిన పాట ఇది. దివ్య ఎస్.మీనన్ అంతే అర్ధవంతంగా ఎలాంటి అక్షర దోషాలకు తావివ్వకుండా చక్కగా పాడి.. మనసు మెలిపెట్టింది.

11.సింగిల్స్ యంధమ్ (భీష్మ)

అన్నీ లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్సే. మా సింగిల్స్ కంటూ ఒక్క పాట కూడా లేదా అనుకునే యువత కోసం మహతి స్వరసాగర్ సృష్టించిన పాట ఈ సింగిల్స్ యాంథం. శ్రీమణి సాహిత్యం సరదాగా ఉంటే.. అనురాగ్ కులకర్ణి గొంతు అల్లరిగా ఉంటుంది. రెండు కలిసి పాటను సూపర్ హిట్ చేశాయి. పిక్చరైజేషన్ కూడా అంతే హుందాగా ఉంటుంది.

12.వాట్టే బ్యూటీ (భీష్మ)

కాసర్ల శ్యామ్ రాసిన లిరిక్స్ లో అర్ధాలు వెతుక్కోకుండా.. సరదాగా వింటూ, చూస్తూ టైంపాస్ చేయగలిగే పాట ఇది. రష్మిక మాస్ స్టెప్స్, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ ఈ పాటకు హైలైట్.

13.నక్కిలీసు గొలుసు (పలాస 1978)

చక్కని ఉత్తరాంధ్ర జానపద గీతమిది. అయితే.. ఈ పాట విడుదలయ్యాక కానీ, సినిమా విడుదలయ్యాక కానీ వైరల్ అవ్వలేదు. దుర్గారావు టిక్ టాక్ వీడియో కారణంగామ్ ఢీ డ్యాన్స్ షోలో పండు పెర్ఫార్మెన్స్ వల్ల విపరీతంగా వైరల్ అయిపోయింది పాట. ఇప్పుడు ఎక్కడ విన్నా ఈ పాటే. అయితే.. ఈ జానపద గీతాన్ని నవతరానికి అందించిన రఘు కుంచె మాత్రం అభినందనీయుడు.

14.నింగి చుట్టే (ఉమ మాహేశ్వర ఉగ్ర రూపస్య)

ప్రకృతిని, జీవితంతో పోలుస్తూ ఇదివరకు చాలా పాటలొచ్చాయి కానీ.. ఇంత అందమైన వర్ణన మాత్రం రాలేదేమో. విశ్వ పెన్నుకు దండం పెట్టాల్సిందే. పాట వింటూ, చూస్తూ ఒక అందమైన అనుభూతికి లోనవుతారు!

15.మనసు మరీ (వి)

ఈ వయసులో సీతారామశాస్త్రి గారు యువ ప్రేమికుల హృదయాల్లోకి ఎలా తొంగి చూస్తున్నారో, వాళ్ళ భావాలను పాటలా ఎలా మలుస్తున్నారో నాకైతే అర్ధం కావడం లేదు. ఒకరినొకరు సర్వసంగ భావిస్తే జీవితం ఎంత అందంగా ఉంటుందో ఈ పాట ద్వారా తెలియజెప్పారు శాస్త్రి గారు. అయితే.. కాస్త తెలుగు స్పష్టంగా పలకడం వచ్చినవాళ్లు పాడి ఉంటె పాట భావం మరింతగా వ్యక్తమయ్యేది.

16.వస్తున్నా వచ్చేస్తున్నా (వి)

ఈ పరుగుల ప్రపంచంలో విరహం అనే పదం కూడా తెలియడం లేదు జనాలకి. ప్రేమలో శృంగారమే సమస్తమైపోతున్న తరుణంలో.. విరహం యొక్కం అవసరం, గొప్పదనం మహగొప్పగా వివరించిన పాట “వస్తున్నా వచ్చేస్తున్నా”. ఈ మాయ కూడా సిరివెన్నెలకే సొంతం. శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేదిల గాత్రం బాగుంటుంది. లాంగ్ డిస్టెన్స్ లవర్స్ కి ఈ సాంగ్ ఒక యాంధం లాంటిది.

17.తరగతి గదిలో (కలర్ ఫోటో)

రొటీన్ లవ్ స్టోరీలతో కాలేజ్ లవ్ స్టోరీస్ అనేవి మర్చిపోతున్నాం. ఎప్పుడో “హ్యాపీ డేస్” తర్వాత కాలేజ్ లవ్ గురించి అంత అందంగా, అర్ధవంతంగా చూపించిన సినిమా “కలర్ ఫోటో”. “తరగతి గదిలో” అనే పాటను కిట్టు విస్సాప్రగడ రాసిన తీరును, కాల భైరవ స్వరం డామినేట్ చేసింది. అయితేనేం.. వింటున్నవాళ్ళు తరగతి గదిలో కూర్చున్న అనుభూతిని చెందుతారు.

18.ది గుంటూరు సాంగ్ (మిడిల్ క్లాస్ మెలోడీస్)

అప్పట్లో “వివాహ భోజనంబు”.. ఆ తర్వాత ఎప్పుడో “ఎగిరే పావురమా” అనే సినిమాలో “ఆహా ఏమి రుచి” అనే పాట చూసి స్పందించిన జిహ్వ మళ్ళీ “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమాలోని “ది గుంటూరు సాంగ్” విన్నాక/చూసాక స్పందించింది. గుంటూరు గల్లీల్లో దొరికే స్పెషల్ ఐటెమ్స్ అన్నీ కట్టగట్టి కళ్ళ ముందు ఉంచేసాడు రచయిత కిట్టు విస్సాప్రగడ.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus