టాలీవుడ్‌లో ఇప్పుడు అఘోరా పవర్‌ను చూస్తున్నారు. ‘అఖండ’ సినిమాతో నందమూరి బాలకృష్ణ అఘోరాగా మారి… వెండితెరపై శివతాండవం ఆడుతున్నాడు. అఘోరాగా బాలయ్య చూపించిన వెర్సటాలిటీకి ప్రస్తుతం టాలీవుడ్ ఫిదా అయిపోయింది. అయితే టాలీవుడ్‌లో అఘోరా కనిపించిన తొలి నటుడు బాలయ్య కాదు. అంతకుముందే కొంత మంది ఆ తరహా పాత్రలు కొన్ని పోషించారు. మరి అవి వారికి విజయాలు అందించాయా?
* చిరంజీవి శివుడిగా నటించిన చిత్రం ‘శ్రీ మంజునాథ’. సినిమాలో కీలక సమయంలో చిరంజీవి అఘోరాగా కనిపిస్తాడు. భక్తుడిగా నటించిన అర్జున్ కోసం చిరంజీవి ఆ గెటప్‌లో వస్తాడు.
* ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘నాగవల్లి’. వెంకటేశ్ ఈ సినిమాలో ఓ సందర్భంలో అఘోరా తరహాలో పాత్రలో మెరిశాడు. పి.వాసు ఈ సినిమా దర్శకుడు
* నాగార్జున అఘోరా తరహా పాత్రలో నటించిన చిత్రం ‘ఢమరుకం’. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నాగ్ కాసేపు అఘోరాగా కనిపిస్తాడు. ఇందులో ప్రకాశ్‌రాజ్ శివుడి పాత్రలో కనిపించాడు.
* అంతకుముందు ‘నేను దేవుణ్ని’ సినిమాలో ఆర్య కూడా ఇలాంటి పాత్రలోనే కనిపించాడు. సినిమాను ఊహించని హైకి తీసుకెళ్లిన పాత్ర ఇది.
* యువ నటుడు విశ్వక్ సేన్ కూడా ఇప్పుడు అఘోరాగా కనిపించే పనిలో ఉన్నాడు. తన తర్వాతి సినిమాలో విశ్వక్‌సేన్ ఈ తరహా పాత్రలో కనిపిస్తాడని సమాచారం.
స్టార్ హీరోలు, యువ హీరోలు అఘోరాలుగా కనిపించిన సినిమాలు ఇవే. ఇందులో ‘అఖండ’ ఒక్కటే భారీ విజయాన్ని అందుకుంది. మిగిలిన స్టార్ హీరోల సినిమాలు ఆశించిన మేర విజయం సాధించలేకపోయాయి. ‘నేను దేవుణ్ని’ విమర్శకులు ప్రశంసలు పొందింది. అలా అఘోరా ఇప్పటివరకు బాలయ్యకే బాగా కలిసొచ్చిందని చెపొచ్చు.