ఒకప్పుడు మలయాళం సినిమాలు అంటే ఇంట్లోనే కూర్చుని చూసే సినిమాలు అని అంతా కామెంట్స్ చేసేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో మంచి కంటెంట్ ఇస్తున్న సినిమాలుగా రికార్డులకెక్కాయి. అలాగే తెలుగులో కూడా మలయాళ సినిమాలను రీమేక్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. నిజానికి మేకింగ్ విషయంలో మలయాళం సినిమాలను చూసి మన వాళ్ళు చాలా నేర్చుకోవాలి అనడంలో అతిశయోక్తి లేదు. సరే ఇక అసలు విషయానికి వచ్చేస్తే.. ఇటీవల మలయాళంలో విడుదలైన మోహన్ లాల్,మమ్ముట్టి వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఘోరంగా ప్లాపయ్యాయి.
కానీ అదే టైంలో ఓ చిన్న సినిమా.. అది కూడా కేవలం రూ.1.8 కోట్ల బడ్జెట్ తో తీసిన చిన్న సినిమా అక్కడ రూ.55 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి రికార్డులు సృష్టించింది. అదే ‘రోమాంచం’. జీతూ మాధవన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి 3న రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ ఈ మూవీ అక్కడ మంచి కలెక్షన్లను సాధిస్తూ దూసుకుపోతుంది. 7 మంది బ్యాచిలర్స్.. వాళ్ళు రూంలో ఆడే స్పిరిట్ గేమ్ చుట్టూ జరిగే కథ ఇది.
హర్రర్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. కామెడీ కూడా ఓ రేంజ్లో ఉంటుంది. నటీనటులంతా కొత్త వాళ్ళే. స్పిరిట్ గేమ్ థీమ్ తో ఆల్రెడీ తమిళంలో ‘డిమోటీ కాలనీ’ అనే సినిమా వచ్చింది. కానీ టేకింగ్ విషయంలో ఆ సినిమాకి.. ఈ సినిమాకి అస్సలు సంబంధం ఉండదు. ఆ సినిమా చాలా భయపెడితే.. ‘రోమాంచం’ ఫుల్ గా నవ్విస్తుంది.
ఫుల్ రన్లో ఈ మూవీ రూ.60 కోట్ల గ్రాస్ మార్క్ ను అధిగమించే అవకాశాలు ఉన్నాయని మలయాళం ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అలాగే మన తెలుగు ప్రేక్షకులు అయితే .. ‘ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు విడుదల అవుతుందా అని కొందరు.. మరికొంతమంది అయితే తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్ చేస్తే బాగుణ్ణు’ అని కోరుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.