మహానుభావుడు

వరుస విజయాలతోపాటు “శతమానం భవతి” చిత్రంతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు సంపాదించుకొన్న శర్వానంద్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “మహానుభావుడు”. ఒ.సి.డి (అతిశుభ్రత) అనే సమస్యతో బాధపడే యువకుడిగా శర్వానంద్ నటించిన ఈ చిత్రం దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను సినిమా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : ఆనంద్ (శర్వానంద్) అందం, ఉద్యోగం, మంచితనం వంటి సుగుణాలతోపాటు ఓ.సి.డి (—-) అనే ఒక చాలా రేర్ డిసార్డర్ ఉన్న సగటు యువకుడు. అతి పరిశుభ్రత ఇతడి సమస్య, తన సామాన్లు మాత్రమే కాదు చుట్టుపక్కల సామాన్లతోపాటు జనాలు కూడా శుభ్రత పాటించాలని వెంపర్లాడుతుంటాడు. అందుకోసం తాను కష్టపడి.. తన తోటి వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తుంటాడు. ఇలాంటి వింత స్వభావం కలిగిన ఆనంద్.. తొలిచూపులోనూ మేఘన (మెహరీన్)ను ప్రేమిస్తాడు. లక్కీగా ఆ అమ్మాయి తాను పనిచేస్తున్న ఆఫీసులోనే జాయిన్ అవ్వడంతో.. తన ప్రేమను సఫలీకృతం చేసుకోవడం మరింత సులభతరమవుతుందనుకొంటాడు.

ఆనంద్ అలవాట్లతోపాటు అతడి ఓ.సి.డీని కూడా అర్ధం చేసుకొన్న మేఘన అతడిని ప్రేమిస్తుంది. కరెక్ట్ గా ప్రేమ పెళ్లివైపు మళ్లుతోంది అనుకొనే టైమ్ లో ఒక యాక్సిడెంట్ కారణంగా వారి ప్రేమకు ఆదిలోనే హంసపాదు పడుతుంది. ఆనంద్ తన ప్రేమను గెలుచుకోవాలంటే.. తన ఊరు వచ్చి అక్కడి అపరిశుభ్రమైన ప్రాంతంలో ఉండి, మట్టిలో మల్లయుద్ధం చేయాలని రూల్ పెడుతుంది మేఘన. అసలు మట్టివాసనను కూడా అసహ్యించుకొనే ఆనంద్.. మేఘన ప్రేమను పొందడం కోసం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? మట్టిలో మల్లయుద్ధం గెలిచాడా? అనేది “మహానుభావుడు” చూసి తెలుసుకొని మనస్ఫూర్తిగా నవ్వుకోవాల్సిన విషయాలు.

నటీనటుల పనితీరు : ఓ.సి.డితో బాధపడే యువకుడి పాత్రలో శర్వానంద్ జీవించేశాడు. ప్రత్యేకమైన కామెడీ ట్రాక్స్ లేకుండా శర్వా క్యారెక్టర్ కి ఉన్న డిసార్డర్ ను బేస్ చేసుకొని రాసిన సన్నివేశాల్లో శర్వా కామెడీ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తుంది. “కృష్ణగాడి వీరప్రేమగాధ” ఫేమ్ మెహరీన్ ఈ చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ.. ముద్దుగా ముచ్చటగా అందంతోపాటు అభినయంతోనూ అలరించింది. శర్వానంద్ తర్వాత అదే స్థాయిలో ప్రేక్షకులను నవ్వించిన క్యారెక్టర్ వెన్నెల కిషోర్ ది. శర్వానంద్ కాంబినేషన్ లో విశేషంగా ఆకట్టుకొన్నాడు. భద్రం తన టిపికల్ స్లాంగ్ తో కడుపుబ్బ నవ్వించాడు. తండ్రి పాత్రలో నాజర్ పెద్దతనాన్ని పూర్తి స్థాయిలో ప్రెజంట్ చేశారు.

సాంకేతికవర్గం పనితీరు : తమన్ సాంగ్స్ అన్నీ చాలా క్యాచీగా ఉన్నాయి, ఎక్కడో విన్నట్లే ఉన్నా పిక్చరైజేషన్ కొత్తగా, హుందాగా ఉండడంతో ఆడియన్స్ సాంగ్స్ ను బాగా ఎంజాయ్ చేస్తారు. నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. చాలా కలర్ ఫుల్ గా, ప్లెజంట్ గా ప్రతి సన్నివేశం ఆడియన్స్ కు మంచి సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బాగుండేది. అలాగే సీన్ టు సీన్ కనెక్టివిటీ కూడా కొన్ని చోట్ల సింక్ అవ్వలేదు. ముఖ్యంగా ఫస్టాఫ్ లో చాలా జర్క్స్ వచ్చాయి. యువి ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు ప్రతి ఫ్రేమ్ లోనూ కనిపిస్తాయి. సినిమా చాలా లావిష్ గా రిచ్ గా కనిపించడానికి వంశీ-ప్రమోద్ ల నిర్మాణ విలువలే కారణం.

“భలే భలే మగాడివోయ్”లో హీరోకి మతిమరుపు అనే చాలా కామన్ ప్రోబ్లమ్ ను ఎక్కువ స్థాయిలో చూపి విశేషమైన కామెడీ పండించిన మారుతి.. “మహానుభావుడు” విషయంలోనూ సేమ్ ఫార్మాట్ ఫాలో అయ్యాడు. కాకపోతే.. ఇక్కడ మతిమరుపుకి బదులు ఓ.సి.డి (అతి పరిశుభ్రత) అనే సరికొత్త డిసార్డర్ ను కథానాయకుడి క్యారెక్టర్ కు యాడ్ చేసి, అందుకు తగ్గ సరదా సంభాషణలు, సింగిల్ లైన్ పంచెస్ తో ఇంకో హిట్ కొట్టాడు. కాకపోతే.. “భలే భలే మగాడివోయ్” స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ రేంజ్ లో కాక మామూలు హిట్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కామెడీతోపాటు ఎమోషన్ కూడా అదే స్థాయిలో ఎలివేట్ చేయలేకపోయాడు మారుతి. అలాగే సెకండాఫ్ మొత్తం హీరోకి ఉన్న ఓ.సి.డిని బేస్ చేసుకొని క్రియేట్ చేసిన సన్నివేశాలే తప్ప అతడి ప్రేమను ఎక్కడా పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయలేదు. అదే గనుక జరిగి ఉంటే సినిమా హిట్ లెవల్ ఇంకో స్థాయిలో ఉండేది.

విశ్లేషణ : “రాధ”తో సక్సెస్ ట్రాక్ నుండి కాస్త పక్కకు వెళ్లిన శర్వానంద్ “మహానుభావుడు” చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చేసాడు. అలాగే.. ప్రతి పండుగకు హిట్ కొడుతూ వస్తున్న శర్వా మరోమారు ఫెస్టివల్ విన్నర్ గా నిలిచాడు. అలాగే.. “బాబు బంగారం”తో దెబ్బ తిన్న మారుతి కూడా ఈ చిత్రంతో సక్సెస్ ను సొంతం చేసుకోవడం విశేషం.

రేటింగ్ : 2.5/5

Note: ఈ రివ్యూ మా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus