Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!
- November 6, 2026 / 10:46 PM ISTByPhani Kumar
Cast & Crew
- NA (Hero)
- నయనతార (Heroine)
- రెజీనా, దునియా విజయ్, ఊర్వశి,యోగిబాబు, ఖుష్బూ, స్నేహ, సునీల్, అభినయ తదితరులు (Cast)
- సుందర్ సి (Director)
- డా ఇషారి కె గణేష్ (Producer)
- హిప్ హాఫ్ తమిళ (Music)
- గోపి అమర్ నాథ్ (Cinematography)
- ఫెన్నీ ఒలీవర్ (Editor)
- Release Date : 6th నవంబర్ 2026
- వెల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లిమిటెడ్ (Banner)
2020 కోవిడ్ టైంలో ‘అమ్మోరు తల్లి'(తమిళంలో ‘మూకుత్తి అమ్మన్’) అనే సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఆర్ జె బాలాజీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మెజారిటీ ఆడియన్స్ ను మెప్పించింది. దర్శకుడిగా అతనికి మంచి పేరు కట్టబెట్టింది. ఇదిలా ఉండగా.. ‘అమ్మోరు తల్లి’ చిత్రానికి సీక్వెల్ కూడా రూపొందింది. తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో రిలీజ్ చేశారు. కాకపోతే దీనికి దర్శకుడు మారిపోయాడు. సుందర్ సి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. మరి అమ్మోరు తల్లి రేంజ్లో ఈ సినిమా మెప్పించిందో లేదో తెలుసుకుందాం రండి :
Mahasakthi Movie Review

కథ: శక్తి(నయనతార) ఓ కానిస్టేబుల్. తల్లి బాలమ్మ(ఊర్వశి) తప్ప ఈమెకు మరో ప్రపంచం ఉండదు. అయితే నిద్రపోతున్నప్పుడు ఈమెకు వింత వింత కలలు వస్తుంటాయి. అందులో మైలాంచి అనే ఊరికి రమ్మని ఈమెకు సంకేతాలు అందుతూ ఉంటాయి. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే..ఒక రోజు ఈమె కళ్ళ ఎదుట ఓ పాపని కిడ్నాప్ చేస్తారు. ఆమెను రక్షించే క్రమంలో ఓ పెద్ద తాంత్రికుడి కొడుకుని హతమారుస్తుంది. దీంతో ఆమెకు ప్రమోషన్ కూడా వస్తుంది. అందులో భాగంగా మైలాంచి అనే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది శక్తి. ఆ ఊరికి వెళ్ళాక ఈమెకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? రాజసింహా(సునీల్) భైరా(రెజీనా) భైరా ప్రియుడు(దునియా విజయ్) ఎందుకు శక్తిని చంపాలని చూస్తున్నారు? అసలు శక్తి ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.

నటీనటుల పనితీరు: శక్తి, అమ్మోరు తల్లి వంటి రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో నయనతార బాగా చేసింది. దేవత అవతారంలో నయనతార బాగా సెట్ అయ్యింది. ఆమెను చూసినప్పుడు కచ్చితంగా డివైన్ ఫీలింగ్ కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఊర్వశి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. యోగిబాబు కామిడీ క్రింజ్ ప్రో మాక్స్ ఫీలింగ్ ఇచ్చింది. రెజీనా సైతాన్ పాత్రలో బాగానే చేసింది. కానీ ఎందుకో ఆమె డబ్బింగ్ సెట్ అవ్వలేదు. దునియా విజయ్ పేరుకి విలన్ పాత్రే, గంభీరంగా కనిపించాడు కానీ పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ అయితే చేయలేదు. సునీల్ కి తమిళ సినిమాల్లో ఏదో ఒక పాత్ర దక్కుతుంది. అది అతనికి సెట్ అయినా,అవ్వకపోయినా.. అతను చేసుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాలో అతను చేసిన పాత్ర కూడా ఆ కోవకే చెందుతుంది. అభినయ,స్నేహా,ఖుష్బూ కేమియోలు బాగున్నాయి.

సాంకేతిక నిపుణుల పనితీరు: సుందర్ సి తమిళంలో మరో లారెన్స్ టైపు దర్శకుడు. ఒకప్పుడు ‘అరుణాచలం’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమాలు ఇచ్చినవాడే. కాకపోతే తర్వాత ఆ స్థాయికి తగ్గ హిట్ ఇవ్వలేకపోయాడు. ఓ దశలో ఫేడ్ అవుట్ అయిపోయాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. అలాంటి టైంలో ‘చంద్రకళ’ అనే హారర్ సినిమా వర్కౌట్ అయ్యింది. అప్పటినుండీ అలాంటి సినిమాలు వరుసగా చేస్తూ వచ్చాడు. ఎన్ని పార్టులు వచ్చినా ఆడియన్స్ పట్టించుకోలేదు.
అయినా అతని దండయాత్ర ఆపలేదు. బాక్, మదగజరాజ సినిమాలు కమర్షియల్ వర్కౌట్ అవ్వడంతో.. ‘అమ్మోరు తల్లి’ సీక్వెల్ చేసే అవకాశం ఇతనికి లభించింది. మొదటి భాగం ఫాంటసీ బ్యాక్ డ్రాప్ అయినప్పటికీ.. కొంత రిలేటబుల్ గా ఉండటంతో ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ సీక్వెల్ విషయానికి వచ్చేసరికి.. ఇందులో ఆడియన్స్ ఎక్సయిట్ అయ్యే ఎలిమెంట్స్ పెద్దగా ఏమీ లేవు. అయినప్పటికీ ఫస్ట్ హాఫ్ ను బాగానే నడిపించాడు. ముఖ్యంగా ఇంటర్వల్ బ్లాక్ బాగుంది.
పాములు మెట్లుగా మారి నయన్ కి సాయం చేసే సీన్ మాస్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ కి పాస్ మార్కులు పడేలా చేస్తుంది. కానీ సెకండాఫ్ విషయానికి వచ్చేసరికి.. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా బోరింగ్ గా ఉంది. వరుసపెట్టి వీఎఫ్ఎక్స్ షార్ట్స్ పెట్టేసి.. ఎంగేజ్ చేయాలని చూశాడు. కొన్ని విజువల్స్ బాగున్నప్పటికీ మరికొన్ని చోట్ల కార్టూన్ బొమ్మలు చూస్తున్న ఫీలింగ్ కలిగింది. నిర్మాత ఈ సినిమాకి దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్ పెట్టినట్టు ప్రచారం చేసుకున్నారు. ఆ రేంజ్ ఔట్పుట్ తెరపై కనిపించిందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్థితి. అయితే హిప్ హాఫ్ తమిళ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. పాటలు వినసొంపుగా లేవు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ అంతంత మాత్రమే.

విశ్లేషణ: ‘అమ్మోరు తల్లి’ స్థాయిలో కనెక్ట్ అయ్యే అంశాలు ‘మహాశక్తి’లో లేవు. సీక్వెల్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలనే అత్యాశతో తీసినట్టు ఉంటుంది. టార్గెటెడ్ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో సంతృప్తి పరచని చిత్రంగా మిగిలిపోతుంది.

ఫోకస్ పాయింట్: బోరింగ్ ఫాంటసీ డ్రామా
రేటింగ్: 1.5/5















