“స్పైడర్” వల్ల చాలా అలిసిపోయాను, ఇంకోసారి బైలింగువల్ అంటే బాగా ఆలోచించాలి! : మహేష్ బాబు

“ఇంకో రెండ్రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది, దాదాపు 1000 పైగా జనాలు ఎంతో కష్టపడి పనిచేశాం, ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇవ్వడం కోసం మేం పడ్డ శ్రమను వారు ఏ విధంగా రిసీవ్ చేసుకొంటారోననే టెన్షన్ లో ఉన్నాను” అంటూ “స్పైడర్” సినిమా రిలీజ్ పట్ల తాను ఎంత ఎగ్జయిటెడ్ గా ఉన్నదీ, మురుగదాస్ తో పని చేయాలన్న తన పదేళ్ళ కల నెరవేరడం మొదలుకొని.. సినిమాకి సంబంధించిన చాలా విశేషాలను సవివరంగా మీడియాతో పంచుకొన్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు.

నా కెరీర్ లోనే హయ్యస్ట్ బడ్జెట్ & బిగ్గెస్ట్ రిలీజ్
ఇప్పటివరకూ నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ మాత్రమే కాదు హయ్యస్ట్ బడ్జెట్ (125 కోట్ల రూపాయలు)తో తెరకెక్కిన సినిమా “స్పైడర్”. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, అరబిక్ వెర్షన్స్ లో సినిమా రిలీజ్ అవుతుండడం చాలా ఎగ్జయిటింగ్ గా ఉంది. అన్నిట్నీ మించి సినిమా స్కేల్, కాన్సెప్ట్ ప్రపంచ సినిమా స్థాయిలో ఉంటుంది. తెలుగులో ఈ తరహా సినిమా రావడం ఇదే మొదటిసారి, సో ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకొంటారన్న టెన్షన్ కూడా ఉంది.

మురుగదాస్ తో వర్క్ చేయడం నా కల..
పదేళ్ళ నుండి మురుగదాస్ గారితో కలిసి వర్క్ చేయాలనుకొంటున్నాను. ఆ కల ఇప్పటికి “స్పైడర్” సినిమాతో నెరవేరడం చాలా ఆనందంగా ఉంది. ఆయన వర్కింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది, నటుల నుంచి తనకు కావాల్సిన, సన్నివేశానికి అవసరమైనంతవరకు మాత్రమే పెర్ఫార్మెన్స్ ను ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఆయన స్పెషలిస్ట్.

బహుశా ఇదే మొదటిసారేమో..
ఇప్పటివరకు తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో చాలా బైలింగువల్ మూవీస్ వచ్చి ఉంటాయి. కానీ.. “స్పైడర్”లా చాలా డెడికేటెడ్ గా రెండు భాషల్లోనూ ప్రతి సన్నివేశాన్నీ చిత్రీకరించిన ఏకైక సినిమా. నేటివిటీ మొదలుకొని నటీనటుల వరకూ ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకొన్నామ్.

సినిమాలో స్పైడర్ ఉండదు..
హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కోసం రిలీజ్ చేసిన టీజర్ లో రోబోటిక్ స్పైడర్ ను చూసి.. అది సినిమాలో కూడా ఉంటుందేమోనని చాలామంది అనుకొంటున్నారు. అది కేవలం హీరో క్యారెక్టరైజేషన్ జనాలకు అర్ధమవ్వడం కోసం డిజైన్ చేశాం. సినిమాలో ఆ రోబోటిక్ స్పైడర్ ఎక్కడా ఉండదు.

అనుకున్నంత ఈజీ కాదు..
మొదట తెలుగు-తమిళ భాషల్లో ఏకకాలంలో షూట్ చేద్దామనుకొన్నప్పుడు.. “హా ఏముందిలో రెండో టేక్ తమిళ్ లో తీస్తే సరిపోతుంది” అనుకొన్నా కానీ.. షూటింగ్ స్టార్ట్ అయ్యాక తెలిసొచ్చింది అసలు కష్టం. ప్రతి సన్నివేశాన్ని తెలుగులో ఒకసారి తమిళంలో ఒకసారి, డిఫరెంట్ షాట్స్ లో రిపీటెడ్ గా షూట్ చేసేసరికి రోజూ విపరీతమైన పని ఒత్తిడి ఫేస్ చేయాల్సి వచ్చేది.

అతని పేరు చెప్పగానే మొదట షాక్ అయ్యాను..
స్టోరీ నేరేషన్ పూర్తయ్యాక మురుగదాస్ గారు ఫోన్ చేసి సినిమాలో విలన్ క్యారెక్టర్ కోసం ఎస్.జె.సూర్యను ఫిక్స్ చేశామని చెప్పగానే షాక్ అయ్యాను. ఈ రోల్ ను ఎస్.జె.సూర్య ఎలా బ్యాలెన్స్ చేస్తాడా అనిపించింది. అయితే.. అది నేను అతడ్ని డైరెక్టర్ గా చూడడం వల్ల, ఒకసారి యాక్టర్ గా ఆయన్ను చూడగానే ఈ రోల్ కి సూర్య పర్ఫెక్ట్ అనిపించింది.

మురుగదాస్ మెసేజ్ పక్కా..
మురుగదాస్ గారు ఇప్పటివరకూ తీసిన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సోషల్ మెసేజ్ ఉండడం అనేది చూస్తూనే ఉన్నాం. అలాగే “స్పైడర్”లోనూ డైరెక్ట్ గా నీతులు, మెసేజులు ఇవ్వకపోయినా.. ఒక అండర్ మెసేజ్ అనేది ఉంటుంది. అదే మురుగదాస్ గారి మార్క్.

ఆ 27 రోజుల్ని మర్చిపోలేను..
అహ్మదాబాద్ లో దాదాపు 27 రోజులు షూట్ చేశాం. రోజూ నైట్ షూట్సే. అసలు అక్కడ ఎన్ని రోజులున్నాం అనేది మా ప్రొడక్షన్ టీం చెప్పేవారకూ మాకేవరికీ అర్ధం కాలేదు. పైగా.. షూట్ మొత్తం రాత్రి 1.00 నుండి తెల్లవారుజాము 5.00 లోపు జరిగేది. అందువల్ల అహ్మదాబాద్ లో మేము సూర్యుడ్ని చూసింది చాలా తక్కువ.

తెలుగు డైరెక్టర్స్ లో వర్క్ చేయనని డైరెక్ట్ గా చెప్పేసారాయన..
నా చిన్నప్పుడు “దళపతి, రోజా” సినిమాలు చూసినప్పట్నుంచి సంతోష్ శివన్ గారితో వర్క్ చేయాలని అనుకొనేవాడ్ని. ఆయన్ని నేను చాలా సినిమాల కోసం ఫోన్ చేసి మరీ అడిగాను. ఆయన నిర్మొహమాటంగా “తెలుగు డైరెక్టర్స్ తో నేను వర్క్ చేయలేను, వాళ్ళ సినిమా టేకింగ్ స్టైల్ వేరు.. నా సినిమాటోగ్రఫీ స్టైల్ వేరు. రెండు సింక్ అవ్వవు” అని చెప్పేశారు. ఆఖరికి మురుగదాస్ గారి సినిమాతో నా కోరిక నెరవేరడం చాలా ఆనందంగా ఉంది.

ఆ క్రేజ్ అంతా బాహుబలి వలనే..
“బాహుబలి” రిలీజ్ అయ్యాక తెలుగు సినిమాల క్రేజ్ భారీగా పెరిగింది. ఇప్పుడు సౌత్ నుంచి ఒక సినిమా వస్తుందంటే.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే “స్పైడర్” హిందీ డబ్బింగ్ రైట్స్ కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. అయితే.. టైమ్ కుదరకపోవడంతో స్పైడర్ ను హిందీలో రిలీజ్ చేయలేకపోతున్నాం.

రకుల్ చాలా డిగ్నిఫైడ్ ఆర్టిస్ట్..
తెలుగు-తమిళం చాలా స్పష్టంగా అర్ధం చేసుకొని మాట్లాడగల నేనే రెండు భాషల్లో ఏకకాలంలో నటించడానికి కాస్త ఇబ్బందిపడ్డాను. కానీ.. రకుల్ మాత్రం చాలా ఈజీగా రెండు భాషలను మేనేజ్ చేసింది. చాలా ఎనర్జిటిక్ గా సినిమాలో కనిపిస్తుంది.

ఇప్పటికి 150 సార్లు చూశాను..
“స్పైడర్” సినిమా మొదలై ఏడాదిన్నరవుతుంది. కంప్లీట్ ఔట్ పుట్ కాకపోయినా.. ఫస్ట్ కాపీ వచ్చి చాలా రోజులవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ మొదలైనప్పట్నుంచి ఇప్పటివరకూ 150 సార్లకంటే ఎక్కువగానే సినిమా చూశాన్నేను.

ఆయన పనితనం స్లోపాయిజన్ లాంటిది..
హారిస్ జైరాజ్ మ్యూజిక్ స్లో పాయిజన్ లాంటిది. వెంటనే ఎక్కదు కానీ.. వినగావినగా మ్యూజిక్ కి ఎడిక్ట్ అయిపోతారు. మా అమ్మాయి సితార “స్పైడర్” సాంగ్స్ ను విపరీతంగా ఎంజాయ్ చేస్తుంది. ఆయన సినిమాకి చేసిన “బ్యాగ్రౌండ్ స్కోర్” విన్నాక.. ఒక సినిమాకి ఇలాంటి బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా చేయొచ్చా అనిపించింది. అంత అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చాడాయన.

ఆ విషయంలో ఎప్పుడూ భయపడలేదు..
“స్పైడర్” స్టోరీకి బడ్జెట్, టైమ్ స్కోప్ ఎక్కువన్న విషయం కథ ఫైనల్ చేసినప్పట్నుంచే మా మైండ్ లో ఉంది. అందువల్ల ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిందని కానీ.. లేట్ అవుతుందని కానీ ఎప్పుడూ కంగారు పడలేదు.

తెలుగుకి తమిళంకి అదొక్కటే తేడా..
తెలుగు/తమిళ సెన్సార్ రిపోర్ట్స్ చూసినవాళ్ళంతా రెంటికీ ఒక నిమిషం తేడా ఉంది ఏంటది అని తెగ ఆడుతున్నారు. తమిళ నిర్మాణ సంస్థ “లైకా ప్రొడక్షన్స్” లోగో ఒక్కటే తేడా.. ఆ లోగో ఒక 30 సెకన్లపాటు ఉంటుంది. అందువల్ల జనాలకి డిఫరెన్స్ కనిపిస్తుందే తప్ప వేరే తేడా ఏమీ లేదు.

ఇప్పుడు ఆ సినిమాలో నటించడం చాలా ఈజీ అయిపోయింది..
“స్పైడర్”లో ప్రతి సన్నివేశం తెలుగు/తమిళంలో ఏకకాలంలో నటించాక ప్రెజంట్ “భరత్ అనే నేను” (వర్కింగ్ టైటిల్) సినిమాలో నటించడం చాలా ఈజీ అయిపోయింది. ఒక సన్నివేశం అయిపోయాక “ఏంటి ఇంతేనా?” అనిపించేది.

రాజమౌళీతో సినిమా ఖాయం..
రాజమౌళిగారితో సినిమా కమిట్ మెంట్ ఎప్పుడో ఉంది. అయితే.. ఆయన-నేను బిజీగా ఉండడం వల్ల అది మెటీరియలైజ్ అవ్వలేదు. 2018లో ఆ ప్రొజెక్ట్ సెట్స్ మీదకు వెళ్తుంది.

– Dheeraj Babu

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus