మాహేష్ పుట్టినరోజు సందర్భంగా “భరత్ అనే నేను” చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తానని దర్శకుడు కొరటాల శివ చెప్పడం.. ఆ తర్వాత షూటింగ్ డిలే కారణంగా చిత్రాన్ని ఏప్రిల్ 27కి పోస్ట్ పోన్ చేయడం ఒక నెలగ్యాప్ లో జరిగిపోయాయి. మహేష్ అభిమానులు కూడా రిలీజ్ డేట్స్ విషయంలో వచ్చిన మార్పులను పెద్దగా పట్టించుకోకుండా తమ హీరోకి ఒక హిట్ వస్తే చాలు అన్న ధోరణితో సినిమా కోసం ఎదురుచూడసాగారు. అయితే.. మళ్ళీ విడుదల తేదీలో భారీ మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
అనుకొన్నదానికంటే సినిమా షూటింగ్ వేగంగా పూర్తవుతుండడంతో ముందు ప్రకటించినట్లుగా జనవరి 14 లేదా జనవరి 28న చిత్రాన్ని విడుదల చేద్దామని అనుకొంటున్నారట చిత్ర నిర్మాతలు. ఇటీవల ఓ ఫైట్ సీక్వెన్స్ తోపాటు పొల్లాచి షెడ్యూల్ కూడా చివరి దశలో ఉండడంతో.. ఏప్రిల్ వరకూ విడుదలను ఆపాల్సిన అవసరం రాకపోవచ్చునని ఫిలిమ్ నగర్ వర్గాల టాక్. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శరత్ కుమార్ లు కీలకపాత్రలు పోషిస్తున్నారు.