తమిళ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సినిమా వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ప్రిన్స్ సరసన ఆడి పాడనుంది. గతనెల 29 నుంచి హైదరాబాద్లో చిత్రీకరణ ప్రారంభమైన ఈ చిత్రానికి మొదట్లో వాస్కోడిగామా అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం కొనసాగింది.
తర్వాత స్టన్ గన్ అనే పేరు పెట్టినట్లు రూమర్లు చక్కర్లు కొట్టాయి. ఈ మూవీకి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదని, వాస్కోడిగామా, స్టన్ గన్ అనేవి తమ సినిమా పేర్లు కావని రీసెంట్ గా మురుగదాస్ బృందం స్పష్టం చేసింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ ఫిల్మ్ కి తెలుగు, తమిళ్ భాషల్లో సెట్ అయ్యే ఒకే టైటిల్ కోసం దర్శకుడు ప్రయత్నిస్తున్నారు. తొందరలోనే ఒక నిర్ణయానికి వచ్చి, దసరా పండుగ సందర్భంగా ఆ పేరుని వెల్లడించనున్నట్లు సమాచారం.
జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రానికి హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో విలన్ గా దర్శకుడు ఎస్.జ్. సూర్య నటిస్తుండడం విశేషం. హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన వెంటనే చిత్ర బృందం చైన్నైకి వెళ్లనుంది. అక్కడ కొన్ని కీలక సన్ని వేశాలను చిత్రీకరించనున్నారు.