కోలీవుడ్‌లో విజయ్ గురించి మాట్లాడేటప్పుడు త్రిష ప్రస్తావన రాకుండా ఉండదు. అంతలా ఇద్దరికి సంబంధించిన అంశాలు పెనవేసుకున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి అనేది తెలియదు కానీ.. ఒకరి గురించి ఎంతగా ఆలోచిస్తారో.. ఒకరి విషయాల గురించి ఇంకొకరు ఎంతగా పట్టించుకుంటారో మరోసారి తెలిసింది. ఈ విషయాన్ని యువ కథానాయిక మాళవిక మోహనన్ చెప్పింది. ఈ మేరకు ఆమె కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇండస్ట్రీలో త్రిష లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అంటూ మాళవిక మోహనన్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేసింది. కొత్త వాళ్లను ఆమె ఎంతగానో ప్రోత్సహిస్తారని చెప్పింది. రజనీకాంత్ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘పేట’ సినిమాలో త్రిషతో కలసి పని చేసిన అనుభవాన్ని మాళవిక గుర్తు చేసుకుంది. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ‘పేట’ సినిమాలో అవకాశం వచ్చింది. రజనీకాంత్ సినిమా కావడంతో ఎంతో ఆనందించా. కానీ, కమర్షియల్ సినిమా చేసిన అనుభవం లేకపోవడంతో కంగారుపడ్డాను అని చెప్పింది.
వారణాసిలో సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో త్రిషతో కలసి కొన్ని సీన్లలో నటించాను. అప్పుడే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిశ్రమలో చాలా మంది ఎవరి పని వారు చేసుకుంటూ వెళ్లిపోతారు. కానీ, త్రిష కొత్తవారిపైనా ఆదరణ చూపిస్తుంది అని పొగిడేసింది మాళవిక. అక్కడికి కొన్ని రోజుల తర్వాత విజయ్‌కు జోడీగా ‘మాస్టర్’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిష నాకో మెసేజ్ పంపింది.
బేబీ.. నీకు ఇంత పెద్ద ప్రాజెక్ట్‌లో అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నా అని రాసింది. అలా అభినందించడానికి పెద్ద మనసు కావాలి అంటూ త్రిషపై మాళవిక ప్రశంసలు కురిపించింది. ఇంతగా త్రిషను పొగిడేసిన మాళవికకు మరో సీనియర్ స్టార్ హీరోయిన్ నయనతారతో పెద్దగా పొసగదు. ఆ మధ్య వరుస విమర్శలు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు త్రిషను అంతగా పొగియేయడం ఆసక్తికరంగానే మారింది.