ఓ చిన్న సినిమా తీయడం.. దాంతో పెద్ద విజయం సాధించడం.. చూడటానికి, వినటానికి చాలా బాగుంటాయి. ఇలాంటి బాగుండే విషయాలు బాగా ఎక్కువగా జరిగేది మాలీవుడ్‌లో అంటే మలయాళ సినిమా పరిశ్రమలో. తొలి రోజులో ఇదో కొత్త విషయంలా ఉండేది కానీ.. ఇప్పుడు వారికి ఇది చాలా సాదీసీదా విషయం అయిపోయింది. అలా ఇప్పుడు కామన్ అయిన్ అన్‌కామన్ థింగ్‌ను సాధించిన సినిమా ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’.
షాహాద్ దర్శకత్వంలో పార్వతి తిరువోతు ప్రధాన పాత్రలో రూపొందిన సినిమా ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’. సెప్టెంబరు 11న విడుదలైన ఈ సినిమా కంటెంట్‌తో, మౌత్ టాక్‌తో భారీ విజయం అందుకుందీ చిత్రం. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.35 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ఇటీవల మలయాళంలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలు సాధిస్తూ ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఆ దారిలోనే ఈ సినిమా కూడా అని చెప్పొచ్చు.
మాలీవుడ్‌లో ప్రస్తుతం నివిన్ పౌలీ, మమితా బైజు సినిమా ‘బెత్లెహోమ్ కుటుంబ యూనిట్’, దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ సినిమాలు ఉన్నాయి. ఈ సమయంలో వచ్చిన ‘ప్రథమ దృష్ట్య కుట్టక్కర్’ వాటిని తట్టుకుని మంచి కలెక్షన్లు రాబడుతోంది. కారుణ్య నియామకం కింద పోలీస్ ఉద్యోగం సంపాదించిన ‘అలీనా అబ్రహాం’ (పార్వతి తిరువోతు) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది.
ఒక పోలీస్ స్టేషన్‌లో రాత్రిళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసుల చేతుల్లో అనుకోకుండా ఓ నేరం జరుగుతుంది. డిపార్ట్‌మెంట్ నియమాలు, క్రైమ్ సీన్ల గురించి బాగా తెలిసిన ఆ పోలీసులు, ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు తమ తెలివితేటలు ఉపయోగిస్తారు. ఈ క్రమంలో కేసు దర్యాప్తును చేపట్టిన సీనియర్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్‌కు (విజయ రాఘవన్), నేరం చేసిన పోలీసులకు మధ్య జరిగే మైండ్ గేమ్‌ను దర్శకుడు ఈ సినిమాగా తెరకెక్కించారు. తెలుగులోకి ఈ సినిమాను డబ్బింగ్ చేసి తీసుకొస్తారేమో చూడాలి.