ఇప్పుడంటే అంతా కామ్‌గా ఉంది కానీ.. కొన్ని నెలల క్రితం టాలీవుడ్‌లో ఓ కుటుంబం గురించి రోజూ చర్చలు జరిగాయి. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఆ కుటుంబం గురించే మాట్లాడుకున్నారంతా. దాంతో ఎంత బాగుండేవారు.. ఇప్పుడేంటి ఇలా అయిపోయారు అంటూ తటస్థులు వేదన పడ్డారు. ఆ కుటుంబమే మంచు ఫ్యామిలీ. మోహన్‌బాబు ఆధ్వర్యంలో ఆ కుటుంబం టాలీవుడ్‌లో ఆదర్శంగా ఉండేది. తండ్రి మాట జవదాటని కొడుకులు, కూతురు అని గొప్పగా చెప్పేవారు. అయితే ఇంటి గుట్టు మొత్తం గొడవల రూపంలో బయటకు వచ్చింది.
ఈ కుటుంబ తగాదాల గురించి మంచు లక్ష్మి గతంలో ఓసారి స్పందించారు. అయితే ఇప్పుడు తన మనసులో మాట ఇది అంటూ తన ఫ్యామిలీ గురించి మాట్లాడారు. తన కుటుంబంలో వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదన్న మంచు లక్ష్మి.. దేవుడు నాకు కనిపించి ఒక వరం కోరుకోమంటే.. నా కుటుంబమంతా మళ్లీ కలిసిపోవాలని కోరుకుంటానని చెప్పారు. గతంలో మాదిరిగా అందరూ కలసి ఉండాలని దేవుడిని అడుగుతానని చెప్పారు.
కుటుంబాల్లో గొడవలు ఉంటాయని… కానీ, ఎన్ని వివాదాలు వచ్చినా చివరకు అందరూ ఒక్కటవ్వాలని అన్నారు మంచు లక్ష్మి. భారతీయ కుటుంబాల్లో కొన్నిసార్లు గొడవలైతే జీవితాంతం కలవకూడదు అనుకుంటారని, కానీ మనకు చివరకు మిగిలేది రక్తసంబంధీకులు మాత్రమే అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని చెప్పారు. ఫ్యామిలీతో కలసి ఉండటానికి ఎన్ని పోరాటాలైనా చేయాలి కానీ, దూరాన్ని పెంచకూడదు అని చెప్పుకొచ్చారామె.
తాను ముంబయిలో ఉంటానని, ఇక్కడి విషయాల గురించి తెలిసినా బాధ పడలేదని కొంతమంది అంటున్నారని.. నేనెంత బాధను అనుభవించానో నాకు మాత్రమే తెలుసనని అసలు విషయం చెప్పారు మంచు లక్ష్మి. మంచు ఫ్యామిలీ వివాదాల గురించి మాట్లాడలేదు కాబట్టి వారికి నచ్చినట్లు ఊహాగానాలు సృష్టించారని, నేను వాటి గురించి స్పందించాలని అనుకోవడం లేదని చెప్పారు. ఇలాంటి వివాదాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. అవన్నీ చూశాక షాక్ అయ్యానని తెలిపారు. నా కుటుంబం గురించి నేను ఏమనుకుంటున్నానో, ఆ వివాదాల వల్ల ఎంత బాధ పడ్డానో బయటవాళ్లకు చెప్పాల్సిన అవసరం లేదని అనుకున్నాను అని తన ఆలోచన గురించి చెప్పారు లక్ష్మీ ప్రసన్న.