రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడంటే… ఎప్పుడు ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు కానీ.. ఒకప్పుడు ఆయన నుండి వచ్చిన సినిమాలు, ఆయన పరిచయం చేసిన నటులు ఇంకెవరూ చేయలేకపోయారు అని చెప్పాలి. అలా ఆర్జీవీ నుండి వచ్చిన నటుల్లో స్టార్ హీరోలు, స్టార్ యాక్టర్లు చాలామంది ఉన్నారు. అందులో మనోజ్ బాజ్‌పాయ్ కూడా ఒకరు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాలు చేసి వావ్ అనిపించిన మనోజ్‌ను తొలి రోజుల్లో రామ్‌గోపాల్ వర్మ మోసం చేశారట. ఈ విషయాన్ని మనోజ్ బాజ్‌పాయ్ స్వయంగా చెప్పారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతున్న మనోజ్ బాజ్‌పాయ్ ఒకప్పుడు వర్మ ప్రతి సినిమాలో నటించేవారు. అలాంటి మనోజ్ ఇటీవల మాట్లాడుతూ ‘సత్య’ సినిమా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. రామ్ గోపాల్ వర్మ తనను హీరోని చేస్తానని చెప్పి మోసం చేశాడని చెప్పాడు. ‘దౌడ్’ సినిమాలో ఓ నటుడి కోసం వెతుకుతున్నారంటే మనోజ్ వెళ్లారట. అక్కడ తొలిసారి ఆర్జీవీని కలిశాడట. అప్పుడు ఇద్దరూ మాట్లాడుతుండగా… ‘బాండిట్ క్వీన్’ సినిమాలో మాన్ సింగ్ పాత్ర చేశాను అని మనోజ్ చెప్పాడట.
దాంతో ఇన్నాళ్లు నీ గురించే వెతుకుతున్నాను, ఆ సినిమా చాలా సార్లు చూశాను, ఆ పాత్ర నాకు బాగా నచ్చిందని ఆర్జీవీ మెచ్చుకున్నారట. ఆ తర్వాత ‘దౌడ్’ సినిమాలో పాత్ర తీసుకోవద్దు. నీ కోసమే ఓ స్క్రిప్ట్ రాశాను, అందులో నువ్వే హీరోగా చేద్దువుగాని అని చెప్పి పంపించేశారటట. ఆ తరువాత ‘సత్య’ సినిమా కోసం పోన్ వస్తే వెళ్లి వర్మను కలిశారట. కానీ అందులో రెండో పాత్ర కోసం తీసుకుంటున్నారని తెలిసి బాధపడ్డారట మనోజ్.
ఆ విషయాన్ని వర్మ దగ్గర చెబితే… భికూ మాత్రే పాత్ర గురించి చెప్పి ఓకే చెప్పేలా చేశారట. లీడ్ క్యారెక్టర్లో ఎవరైనా చేయగలరు, కానీ భికూ మాత్రే నీకు మాత్రమే సాధ్యమవుతుంది అని వర్మ ఒప్పించారట. దాంతో తొలుత బాధపడ్డా, సినిమా రిలీజ్ అయ్యాక భికూ పాత్రకు వచ్చిన స్పందన చూసి చాలా సంతోషపడ్డాను అని చెప్పాడు మనోజ్ బాజ్‌పాయ్.