మరకతమణి

  • June 16, 2017 / 11:39 AM IST

ఆది పినిశెట్టి-నిక్కి గల్రాని జంటగా నటించిన చిత్రం “మరకతమణి”. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించి తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేశారు. హారర్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ : రఘునందన్ (ఆది) ఊర్లో తనకున్న అప్పులు తీర్చడానికి హైద్రాబాద్ లో తన స్నేహితుడితో కలిసి రామ్ దాస్ గ్యాంగ్ లో స్మగ్లింగ్ చేస్తూ డబ్బు సంపాదిస్తుంటాడు. అయితే.. చిన్న చిన్న చోరీలు చేస్తే తన అప్పులు తీరవని, ఏదైనా పెద్ద పనితోనే తన సమస్యలు తీరతాయని నమ్మి.. విక్రమాదిత్యుడి కాలానికి చెందిన “మరకతమణి”ని దొంగిలించడానికి పూనుకొంటాడు. ఆ మరకతమణి వెనుక చిన్న పిట్టకథ ఉంటుంది. ఆ మణిని ఓ వ్యక్తి విక్రమాదిత్యుడి సమాధి నుండి దొంగిలిస్తాడు. దాంతో ఆ మణిని ఎవరు తాకినా మరణిస్తుంటారు. మరి ఈ ప్రమాదం నుండి రఘునందన్ అండ్ గ్యాంగ్ తప్పించుకొన్నారా, మరకతమణిని దక్కించుకోగలిగారా లేదా? అనేది “మరకతమణి” కథాంశం.

నటీనటుల పనితీరు : ఆది కామెడీ టైమింగ్ విషయంలో తేలిపోయినా.. ఇంటెన్సిటీతో కవర్ చేశాడు. డార్క్ కామెడీ సినిమా కావడంతో చాలావరకూ కామెడియన్స్ మాగ్జిమమ్ స్క్రీన్ టైమ్ ను కవర్ చేసేయడం.. ఆదికి పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా ఆస్కారం లభించలేదు. నిక్కి గల్రాని పేరు ఈ సినిమాలో హీరోయిన్ గా నటించినా ఎక్కడ ఆమె పాత్ర హీరోయిన్ ను తలపించదు. కాకపోతే.. మగరాయుడిగా అమ్మడి బాడీ లాంగ్వేజ్ మాత్రం కాస్త నవ్విస్తుంది. రాజనీకాంత్ “భాషా” ఫేమ్ ఆనంద్ రాజ్ చాలా కాలం తర్వాత ట్వింకల్ రామనాధం పాత్రలో కనిపించారు. టిపికల్ బాడీ లాంగ్వేజ్ తో నవ్వించి తన సీనియారిటీని ప్రూవ్ చేసుకొన్నాడు. రాందాస్ ఈ చిత్రంలో మునుపటి చిత్రాలన్నిటికంటే విశేషంగా నవ్వించాడు. శవంగా రాందాస్ నటన, “టార్చర్ ఎపిసోడ్”లో బ్యాచ్ మొత్తాన్ని ముప్పుతిప్పలు పెడుతూ విశేషంగా నవ్వించారు.

సాంకేతికవర్గం పనితీరు : దిబునినన్ ధామస్ స్వరపరిచిన గీతాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా.. జోనర్ తగిన బ్యాగ్రౌండ్ స్కోర్ తో అలరించాడు. విలన్ ఎంట్రీ సీన్స్, మరకతమణి రివీలింగ్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. పి.వి.శంకర్ సినిమాటోగ్రఫీ వర్క్ యావరేజ్ గానే ఉన్నా.. డ్రోన్ షాట్స్ ను బాగా వాడాడు. నైట్ షాట్స్ లో లైటింగ్ సరిగా సెట్ చేసుకోలేదు. డి.ఐ కూడా కొన్ని సీన్స్ కి సింక్ అవ్వలేదు. గ్రాఫిక్స్ బాగా చీప్ గా ఉన్నాయి. కేవలం గ్రీన్ లైట్ తో గ్రాఫిక్స్ సీన్స్ ను కవర్ చేద్దామని ట్రై చేయడం వల్ల ప్రేక్షకుడు మరీ చిల్లరగా ఉందే అనుకొంటాడు. ఇక కథ-కథనం లాంటి కీలకాంశాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకొంటే అంత మంచిది.

దర్శకుడు కామెడీ పండించడం మీద పెట్టిన కాన్సన్ ట్రేషన్ లో సగమైనా కథనంపై పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ముఖ్యంగా చాలా కీలకమైన లాజిక్స్ ను వదిలేయడం, చాలా ప్రశ్నలకి సరైన సమాధానం చెప్పకుండా సన్నివేశాలను యాడ్ చేసుకుంటూ వెళ్లిపోవడం కూడా మైనస్ గా మారింది. అయితే.. కొన్ని సన్నివేశాల్లో కామెడీ బాగా పండడంతో సదరు లాజిక్స్ ను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. దాంతో దర్శకుడు బొటాబోటి మార్కులతో నెట్టుకొచ్చేశాడు.

విశ్లేషణ : కథలో సెన్స్, లాజిక్ లాంటివి పట్టించుకోకుండా చూడగలిగితే 132 నిమిషాలపాటు పూర్తి స్థాయిలో కాకపోయినా.. మధ్యలో కాస్త బోర్ కొట్టిస్తూ.. మొత్తానికి కాస్త అలరించే చిత్రం “మరకతమణి”. డార్క్ కామెడీ జోనర్ లో రూపొందిన ఈ చిత్రానికి కథనం మైనస్ అయినా.. ఓ నాలుగు కామెడీ ఎపిసోడ్స్ విశేషంగా పండడంతో.. ప్రేక్షకులు పొట్టచెక్కలయ్యేలా నవ్వడం ఖాయం!

రేటింగ్ : 2/5

Click Here For ENGLISH Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus