ది రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం చాలా ఎమోషనల్ గా సాగింది. మూడేళ్ళ కష్టం తెరపైకి వస్తుందన్న ఆనందంలో దర్శకుడు మారుతి వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఆ ఎమోషన్ లో ఆయన నోటి నుంచి వచ్చిన ఒకే ఒక్క పదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద యుద్ధానికే దారితీసింది. తమ హీరోని ఉద్దేశించి మారుతి చేసిన వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయి.
అసలు మారుతి ఉద్దేశం రాజమౌళి గొప్పతనాన్ని చెప్పడం. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన జక్కన్నకు థాంక్స్ చెప్తూ, ఒక మీడియం రేంజ్ హీరోని పాన్ ఇండియా స్టార్ గా మార్చారని మారుతి కామెంట్ చేశారు. ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. ప్రభాస్ లాంటి భారీ కటౌట్ ని అందరి ముందు మీడియం రేంజ్ హీరో అనడమే ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు.
అభిమానులు మాత్రం ఈ మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. వర్షం, ఛత్రపతి, మిర్చి లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరోని తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మండిపడుతున్నారు. నీలాంటి వాళ్లకు అవకాశం ఇచ్చినందుకు ప్రభాస్ కు తగిన శాస్తి జరిగిందని కొందరు ఘాటుగా స్పందిస్తున్నారు. మారుతి ఫ్లోలో అన్నా కూడా, ఆ పదం వాడటం కరెక్ట్ కాదని వారి వాదన.
అయితే మరో వర్గం మాత్రం మారుతి వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని సపోర్ట్ చేస్తోంది. బాహుబలికి ముందు అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేష్ బాబుల మార్కెట్ తో పోలిస్తే ప్రభాస్ రేంజ్ కొంచెం తక్కువగానే ఉండేదని గుర్తుచేస్తున్నారు. అప్పటికి ప్రభాస్ ఖాతాలో వంద కోట్ల సినిమా లేదు కాబట్టి, టెక్నికల్ గా మారుతి చెప్పింది నిజమే కదా అని వీరు లాజిక్ తీస్తున్నారు.
ఏది ఏమైనా ఆఫ్రికాలోని మారుమూల గిరిజనులకు కూడా తెలిసే రేంజ్ ఇప్పుడు ప్రభాస్ సొంతం. ఆ క్రెడిట్ రాజమౌళిదే అని చెప్పే క్రమంలో మారుతి వాడిన పదాలు ఇప్పుడు అనుకోని వివాదంగా మారాయి. ఇది కేవలం మాట జారడం మాత్రమే తప్ప, కించపరచడం కాదని మరికొందరు సర్దిచెప్తున్నారు. మొత్తానికి రాజా సాబ్ ఈవెంట్ ఇలాంటి హాట్ టాపిక్ కు వేదికైంది.