మాస్ మహారాజ్ రవితేజ ఏడాదికి కనీసం 2,3 సినిమాలు రిలీజ్ అయ్యేలా చూసుకుంటారు. కానీ ఈసారి ఏడాది నుండి చూసుకుంటే.. అతని నుండి ఒక్క సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. గత ఏడాది అంటే ఆగస్టు 15న రవితేజ నటించిన ‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ అయ్యింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘రైడ్’ కి రీమేక్.
అయితే తెలుగులో మాత్రం దారుణంగా ప్లాప్ అయ్యింది. దీనికి ముందు రవితేజ చేసిన ‘ఈగల్’ ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు కూడా డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. దీంతో రవితేజ తన నెక్స్ట్ సినిమాని కొంచెం సీరియస్ గా తీసుకున్నారు. అదే ‘మాస్ జాతర’. రవితేజ కెరీర్లో ఇది 75వ సినిమాగా రూపొందుతుంది. ల్యాండ్ మార్క్ మూవీ కాబట్టి.. దీనిపై ఎక్కువ టైం పెట్టారు రవితేజ. ఇందులో అతను రైల్వే పోలీస్ గా కనిపించనున్నారు. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా భాను భోగ వరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
వాస్తవానికి ఆగస్టు 27న అంటే ఈరోజే సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇటీవల తెలుగు ఫెడరేషన్ వర్కర్స్ చేసిన సమ్మె కారణంగా డిలే అయ్యింది. అయితే కొత్త డేట్ ను ఇంకా ప్రకటించలేదు. రామోజీ ఫిలింసిటీలో ఓ సాంగ్ చిత్రీకరణ జరపాల్సి ఉంది. ఇంకా కొంత ప్యాచ్ వర్క్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఇదిలా ఉండగా.. ‘మాస్ జాతర’ సినిమాని అక్టోబర్ 31న విడుదల చేసేందుకు నాగవంశీ రెడీ అయ్యారట. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ తో చర్చలు కూడా జరిపినట్టు టాక్ నడుస్తుంది. అయితే ఏకంగా 2 నెలల వరకు ‘మాస్ జాతర’ ని పోస్ట్ పోన్ చేయడం అంటే అభిమానులకు పెద్ద పరీక్ష అనే చెప్పాలి.