‘ఓజీ’ (They Call Him OG) సినిమా వచ్చి ఐదు రోజులు అవుతోంది.. తొలి షో పడి అయితే ఆరు రోజులు అయిపోయింది. కానీ ఇప్పటివరకు మెగాస్టార్ చిరంజీవి నుండి ఇప్పటివరకు ఎలాంటి రివ్యూ లేదు. ఏమైందా అని చూస్తే.. చిరంజీవి విదేశాల్లో ఉండటంతో సినిమా చూడలేదు అని తెలిసింది. అయితే చిరంజీవి సిటీలోకి వచ్చేశారు.. ఎప్పుడు సినిమా చూస్తాడు అని అనుకుంటుండగా సోమవారం రాత్రి సినిమా చూసేశాడు.
మొత్తంగా మెగా ఫ్యామిలీ వచ్చి స్పెషల్ షో వీక్షించింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లోని ప్రసాద్స్ ప్రివ్యూ థియేటర్‌లో వేసిన ‘ఓజీ’ సినిమా స్పెషల్ వేశారు. మెగా ఫ్యామిలీ కోసం నిర్మాత డీవీవీ దానయ్య ఈ షో వేశారు. దీనికి చిరంజీవి – సురేఖ దంపతులు, రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్, తనయ ఆద్య సాయితేజ్, సుష్మిత కొణిదెల, శ్రీజ, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, చిరంజీవి మనవరాళ్లుచ, హీరో అడివి శేష్, నటుడు రాహుల్ రవీంద్రన్, దర్శకుడు సుజీత్, తదితరులు ఈ షోకి హాజరయ్యారు.
అన్నయ్య తన సినిమా చూడటానికి వస్తుండటంతో పవన్ కల్యాణ్ కూడా ప్రివ్యూ థియేటర్‌కు వచ్చారు. సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చిన చిరంజీవిని పిక్చర్ ఎలా ఉందని చిరంజీవిని అడగ్గా… ‘సూపర్బ్! మాటలు రావడం లేదు’ అని చెప్పారు. ఇక సినిమా సంగీత దర్శకుడు తమన్, ఇతర సినిమా సాంకేతిక బృందం కూడా ప్రివ్యూకి వచ్చారు.
ఈ సందర్భంగా వీరంతా దిగిన ఓ గ్రూప్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ సినిమా విడుదలైన నాలుగైదు రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. నేటి నుంచి తెలంగాణలో టికెట్ ధరలు తగ్గనుండటంతో సినిమా వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది అని చెబుతున్నారు.