‘హనుమాన్’ తర్వాత తేజ సజ్జా హీరోగా వచ్చిన మరో పాన్ ఇండియా సినిమా ‘మిరాయ్’. గత శుక్రవారం అంటే సెప్టెంబర్ 12న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాజిటివ్ టాక్‌తో వంద కోట్ల క్లబ్ వైపు పరుగులు తీస్తోంది. స్టోరీ, విజువల్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకులు, విమర్శకులు ప్రశంసలు కురిపించారు. చిత్ర బృందం ‘మిరాయ్’ ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసేందుకు థియేటర్ విజిట్లు, టూర్లు ప్లాన్ చేస్తుంది.
ఇదిలా ఉంటే..సోషల్ మీడియాలో ‘మిరాయ్’ ఒక కాపీ చిత్రమంటూ కొందరు విమర్శిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ట్విట్టర్లో ఓ నెటిజన్ ‘మిరాయ్’ చిత్రం 1969 లో విడుదలైన సూపర్ స్టార్ కృష్ణ హీరోగా వచ్చిన ‘మహాబలుడు’కు ఫ్రేమ్ టు ఫ్రేమ్ కాపీ అంటూ ఓ నెటిజన్ యూట్యూబ్ లింక్‌తో సహా పోస్ట్ చేయడంతో ఈ వివాదం రాజుకుంది.
ఈ ట్వీట్ వైరల్ అవ్వడంతో నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఒక వర్గం, ‘మిరాయ్’ నిజంగానే ‘మహాబలుడు’ నుంచి స్ఫూర్తి పొందిందని, కొన్ని సన్నివేశాలు చూస్తుంటే ఆ సినిమా గుర్తుకొస్తుంది అని కామెంట్లు పెడుతున్నారు. దర్శకుడిని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.మరో వర్గం మాత్రం ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తోంది. ‘మహాబలుడు’ కథకు, ‘మిరాయ్’కి ఎక్కడా సంబంధం లేదని, క్యారెక్టర్లు, కథలోని కీలకమైన తల్లి సెంటిమెంట్ వంటి అంశాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని వాదిస్తున్నారు.
సినిమా విజయాన్ని చూసి ఓర్వలేకనే ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.వాస్తవానికి ‘మహాబలుడు’ ‘మిరాయ్’ కథ కథనాల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. కాబట్టి ఉద్దేశపూర్వకంగా ‘మిరాయ్’ ని కొందరు టార్గెట్ చేశారని అర్థం చేసుకోవచ్చు.