ఎందరో అనాథలకు ఆపన్న హస్తం అందిస్తూ అండగా నిలబడుతున్న స్వచ్చంద సంస్థ మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు ప్రజలు తమ వంతుగా సపోర్ట చేయాలని డా.మంచు మోహన్ బాబు కోరారు. ఈ సంస్థ గురించి ఆయన మాట్లాడుతూ ‘’ఈ మార్చి 19న నేను మరో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకుంటాను. 1993 నుండి ప్రతి పుట్టినరోజును విద్యానికేతన్ లో పిల్లల మధ్య జరుపుకోవడం అలవాటు, ఈ విషయం అందరికీ తెలిసిందే. అభం శుభం తెలియని పసి హృదయాలు అందించే ఆశీస్సులు నాకు ఎప్పుడూ గొప్ప అనుభూతినిస్తాయి. అయితే ప్రతి పుట్టినరోజున శుభాకాంక్షలతో పాటు వందల సంఖ్యల పుష్పగుచ్చాలు, పూల దండలు అందుకుంటాను. అవి మరుసటి రోజును వాడిపోతాయి. వాటిని పారవేస్తాం. అయితే ఈసారి నా పుట్టినరోజున నాకు ఎవరూ పూలదండలు, పుష్పగుచ్చాలు తీసుకురాకండి. ఆ డబ్బును ఏదైనా సమాజానికి సేవ చేస్తున్న స్వచ్చంద సంస్థలకు అందజేయమని కోరుతున్నాను.
ఇటీవల మిరాకిల్ ఫౌండేషన్ ను సందర్శించి వారు సమాజానికి అందిస్తున్న తోడ్పాటు చూసి ఇంప్రెస్ అయ్యాను. 3000 మంది ఆనాథ పిల్లలకు తమ వంతుగా సహాయ సహాకారాలను అందిస్తున్నారు. మిరాకిల్ వ్యవస్థాపకుడు కారోలైన్ బౌడ్రియాక్స్ వంటి నిస్వార్ధపరులు ఈ సమాజానికి ఎంతో అవసరం. కాబట్టి ఇలాంటి సంస్థలకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
నా పుట్టినరోజు కోసం ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని సదరు మిరాకిల్ ఫౌండేషన్ సంస్థకు పంపండి. మీరు అందించే ఈ సహాయం ఎంతో మంది చిన్నపిల్లల జీవితాలను మార్చి వేస్తాయి. ఈ సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటున్నాను’’ అన్నారు.