“అఖిల్, హలో, మిస్టర్ మజ్ను” లాంటి వరుస ఫ్లాపుల అనంతరం ఎలాగైనా హిట్ కొట్టాలన్న ధ్యేయంతో అఖిల్ నటించిన తాజా చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. అఖిల్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడు. హీరోగా అఖిల్ కి, డైరెక్టర్ గా బొమ్మరిల్లు భాస్కర్ కి మోస్ట్ ఇంపార్టెంట్ ఫిలిమ్ ఇది. మరి ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ హిట్ అందుకోగలిగాడో లేదో చూద్దాం..!!
కథ: పెళ్లికూతురు తప్ప పెళ్ళికి, పెళ్లి తర్వాత జీవితానికి కావాల్సిన అన్నిట్నీ రెడీ చేసుకొని.. తాళి కట్టడానికి మెడను వెతికేందుకు అమెరికా నుంచి హైద్రాబాద్ వస్తాడు హర్ష (అఖిల్ అక్కినేని). వైవాహిక జీవితంలో తనకేం కావాలో అనే క్లారిటీ పుష్కలంగా ఉంది అనే భ్రమలో ఉన్న హర్షకు జ్ణానోదయం చేస్తుంది విభా (పూజా హెగ్డే). తనకు వచ్చిన సంబంధాల్లో ఆమె కూడా ఒకరు.
జాతకం కలవని ఈ ఇద్దరినీ మనస్తత్వాలు కలుపుతాయి. అయితే.. హర్ష కన్ఫ్యూజన్ కి, విభా క్లారిటీకి సింక్ అవ్వదు. ఆ కారణంగా హర్ష పెళ్లి చేసుకోకుండానే అమెరికా రిటర్న్ అవుతాడు. ఆ తర్వాత హర్ష పయనం ఎటు సాగింది? చివరికి ఏ తీరానికి చేరింది? హర్ష-విభాలు కలిశారా? లేదా? అనేది “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కథాంశం.
నటీనటుల పనితీరు: నటుడిగా అఖిల్ ఇంకా పూర్తిస్థాయిలో పరిపక్వత చెందలేదనే విషయం ఈ సినిమాలోని ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ఒక నటుడీగా హర్ష క్యారెక్టర్లో బిహేవ్ చేయడానికి అఖిల్ చాలా కష్టపడ్డాడు, ఆ ఇబ్బంది అతడి మొఖంలో కనిపిస్తూనే ఉంటుంది. ఇక రెండు లాక్ డౌన్స్ వల్ల వచ్చిన షూటింగ్ గ్యాప్ అఖిల్ బాడీ లాంగ్వేజ్లో కనిపిస్తుంది. పూజా హెగ్డే నటిగా ఇంకాస్త బెటర్ అవుట్ పుట్ ఇవ్వగలదు కానీ..
బొమ్మరిల్లు భాస్కర్ ఆమెను సరిగా హ్యాండిల్ చేయలేకపోయాడు. అఖిల్-పూజా హెగ్డేల కాంబినేషన్ అస్సలు వర్కవుట్ అవ్వలేదు. అఖిల్ చిన్న పిల్లాడిలా ఉండగా.. ఆమెకు అక్కలా ఉంది పూజా. కంప్లీట్ రాంగ్ క్యాస్టింగ్ అని చెప్పాలి. సుడిగాలి సుధీర్, వెన్నెల కిషోర్, అభయ్ లు కామెడీ చేయడానికి ప్రయత్నించి చిరాకు తెప్పించారు. ఇక లెక్కకు మిక్కిలి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నా లేనట్లే.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాలో ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనే క్లారిటీ హీరో క్యారెక్టర్ కి ఉండదు.. ఆడియన్స్ ను సినిమాకి ఎలా కనెక్ట్ చేయాలి అనే క్లారిటీ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కి ఉండదు. పెళ్ళికి కావాల్సింది ప్రేమ కాదు రొమాన్స్ చెప్పడానికి ప్రయత్నించి.. దారుణంగా విఫలమయ్యాడు. ప్రేమ కంటే రొమాన్స్ ఎందులో ఎక్కువ అనే విషయాన్ని వివరించడంలో తాను కన్ఫ్యూజ్ అయ్యి..
ఆడియన్స్ ను కన్ఫ్యూజ్ చేశాడు. కరోన లాక్ డౌన్ ఇంకో మైనస్ గా మారింది. అందువల్ల చాలా సన్నివేశాల్లో కంటిన్యూటీ మిస్ అయ్యింది. ఇలా అన్నీ విధాలుగా దర్శకుడిగా, కథకుడిగా బొమ్మరిల్లు భాస్కర్ విఫలమయ్యాడు. గోపీసుందర్ పాటలు బాగున్నాయి. నేపధ్య సంగీతం మాత్రం ఆస్వాదించదగిన విధంగా లేదు. సినిమాటోగ్రఫీ సోసోగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ చీప్ గా ఉంది.
విశ్లేషణ: అఖిల్ పాపం ఎన్ని రీరీరీరీ ఎంట్రీలు ఇచ్చినా.. కమర్హియల్ హిట్ అందుకోవడం మాత్రం గగనమైపోయింది. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”తో ఆ విషయం మరోసారి స్పష్టమైంది. ముందు అఖిల్ హీరోగా కంటే నటుడిగా గుర్తింపు సంపాదించుకోవడం చాలా ముఖ్యం. ఆ విషయాన్ని అఖిల్ త్వరగా గుర్తించాలి. అలాగే.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకుడిగా తన పంధాను మార్చుకోవాలి అని మరోసారి ప్రూవ్ చేసిన సినిమా ఇది. సో, పండగ పూట ఎలాంటి సినిమా చూడాలి అనేది ప్రేక్షకులే నిర్ణయించుకోవాలి. హ్యాపీ దసరా పీపుల్!
రేటింగ్: 2/5