My Baby Review in Telugu: మై బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • అథర్వ మురళి (Hero)
  • మొహమ్మద్ జీషన్ అయుబ్, బాలాజీ శక్తివేల్, మానస చౌదరి (Heroine)
  • నిమిషా సజయన్ (Cast)
  • నెల్సన్ వెంకటేశన్ (Director)
  • జయంతి అంబేత్ కుమార్ (Producer)
  • జిబ్రాన్ (Music)
  • పార్థిబన్ (Cinematography)
  • వి.జె.సాబు జోసెఫ్ (Editor)
  • Release Date : జూలై 18, 2025
  • ఒలింపియా మూవీస్ (Banner)

తమిళంలో గత నెల “కుబేరా”తోపాటుగా విడుదలై.. మంచి విజయం సొంతం చేసుకున్న చిత్రం “DNA”. అథర్వ మురళి, నిమిషా సజయన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేశన్ దర్శకుడు. ఆ చిత్రాన్ని తెలుగులో సురేష్ కొండేటి “మై బేబీ”గా అనువాద రూపంలో అందిస్తున్నారు. తమిళ ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!

కథ: ప్రేమించిన అమ్మాయి దూరమవ్వడంతో దురలవాట్లకు దగ్గరైన ఆనంద్ (అథర్వ) మానసికంగా కృంగిపోతాడు. తండ్రి సైతం చచ్చిపోరా అని తిట్టే స్థాయికి దిగజారిపోతాడు. అలాంటోడు మళ్లీ నిలదొక్కుకుని చిన్నపాటి మానసిక రుగ్మతి ఉన్న దివ్య (నిమిష సజయన్)ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు.

దివ్య ప్రెగ్నెంట్ అవ్వడంతో కుటుంబం కూడా సంతోషపడుతుంది. అయితే.. సరిగ్గా బిడ్డ పుట్టిన గంటలో మారిపోతుంది. తమకు ఇచ్చిన బిడ్డ తనకు పుట్టిన బిడ్డ కాదు అంటూ గోల చేయడం మొదలెడుతుంది దివ్య.

దాంతో ఏం చేయాలో తోచక ఇంటికి వచ్చేస్తారు ఆనంద్ & ఫ్యామిలీ. కట్ చేస్తే.. దివ్య చెప్పింది నిజమేనని, ఆ బిడ్డ తమ బిడ్డ కాదని DNA టెస్ట్ ద్వారా తెలుసుకొంటాడు ఆనంద్. అప్పటినుండి తన కొడుకు ఏమయ్యాడు? తమ దగ్గర ఉన్న బిడ్డ ఎవరిది? అనేది ఇన్వెస్టిగేట్ చేయడం మొదలెడతాడు.

ఈ క్రమంలో ఆనంద్ కి తోడుగా నిలిచింది ఎవరు? ఈ బిడ్డ మాయం అవ్వడం వెనుక ఎవరున్నారు? ఎందుకని ఇలా బిడ్డను మార్చారు? వంటి ప్రశ్నలకు సమాధానమే “మై బేబీ” చిత్రం.

నటీనటుల పనితీరు: సినిమాలో చాలామంది సీనియర్ & సీజన్డ్ నటులు ఉన్నప్పటికీ.. నిమిషా సజయన్ మెథడ్ యాక్టింగ్ తో ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ముఖ్యంగా బిడ్డను సొంత తల్లిదండ్రులకు అప్పగించిన తర్వాత మదనపడే తల్లిగా నిమిషా నటన కంటతడి పెట్టించడం ఖాయం.

అలాగే.. ఎమోషనల్ గా చాలా బరువైన పాత్రలో అథర్వ ఒదిగిపోయాడు. మాస్ & ఎమోషనల్ సీన్స్ లో మంచి మెచ్యూరిటీ కనబరిచాడు.

తెలుగమ్మాయి మానస చౌదరి పాత్ర చిన్నదే అయినా పర్వాలేదనిపించుకుంది.

బాలీవుడ్ నటుడు మహమ్మద్ జీషన్ అయుబ్ నటన బాగున్నప్పటికీ.. ఆ పాత్రకి ఇంకాస్త డెప్ట్ ఉంటే బాగుండు అనిపిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: కథగా “మై బేబీ” చాలా సింపుల్. అయితే.. ఎమోషనల్ గా కథను నడిపించిన విధానం బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ట్విస్ట్ ను మొదట్లోనే అనవసరంగా రివీల్ చేసారేమో అనిపిస్తుంది కానీ.. హుక్ పాయింట్ గా యూజ్ అయ్యిందనే చెప్పాలి. ఒక మంచి థ్రిల్లర్ కి మదర్ సెంటిమెంట్ ను సమపాళ్లలో యాడ్ చేసి దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ మంచి విజయాన్ని అందుకున్నాడు.

పాటలు తెలుగు వెర్షన్ అంత వినసొంపుగా లేవు. క్వాలిటీ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఎడిటింగ్ చాలా క్రిస్ప్ గా ఉంది. టెక్నికల్ గా ఎలాంటి కంప్లైంట్స్ లేవు.

విశ్లేషణ: కొన్ని సినిమాలు చాలా సింపుల్ గా స్టార్ట్ అయ్యి మంచి థ్రిల్ ఇస్తాయి. “మై బేబీ” అలాంటి సినిమానే. చాలా సాధారణంగా మొదలైన ఈ చిత్రం ముగిసేసరికి మంచి ఎమోషనల్ టచ్ తో సంతృప్తినిస్తుంది. ఒక మాస్ కమర్షియల్ సినిమాకి కావాల్సిన అన్ని పాయింట్స్ తోపాటు.. మదర్ సెంటిమెంట్ అనేది సమపాళ్లలో సెట్ అవ్వడంతో “మై బేబీ” ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందనే చెప్పాలి. అయితే.. ఈ చిత్రం తమిళ వెర్షన్ జూలై 19 నుంచి హాట్ స్టార్ యాప్ లో స్ట్రీమ్ కానుంది. ఒక్కరోజులో ఓటీటీలో విడుదలకానున్న ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు ఎంత ఆసక్తి చూపుతారు అనేది ప్రశ్నార్థకం.

ఫోకస్ పాయింట్: రెండు గంటలపాటు థ్రిల్ చేసే ఎమోషనల్ డ్రామా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus