వరలక్ష్మీ శరత్ కుమార్ ‘శబరి’ మూవీ నుండి ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాట విడుదల

వెర్సటైల్ ఆర్టిస్ట్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘శబరి’. ఈ చిత్రాన్ని మహర్షి కూండ్ల సమర్పణలో మహా మూవీస్ పతాకంపై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మించారు. అనిల్ కాట్జ్ దర్శకుడు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో మే 3న సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు. తాజాగా ‘నా చెయ్యి పట్టుకోవే…’ పాటను విడుదల చేశారు.

‘శబరి’ని పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్న విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఈ పాటను సైతం తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళం… ఐదు భాషల్లో విడుదల చేశారు. ‘శబరి’కి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన బాణీకి తెలుగులో రహమాన్ సాహిత్యం అందించారు. ఈ పాటను అమృతా సురేష్ పాడారు. ‘శబరి మ్యూజిక్’ ఛానల్ ద్వారా సాంగ్ విడుదలైంది.

‘నా చెయ్యి పట్టుకోవే చిన్నారి మైనా…
మబ్బుల్లో తేలిపోదా రివ్వు రివ్వునా…
ఓ కొత్త లోకం చేరి తుళ్లి తుళ్లి ఆడుకుందాం ఎంతసేపైనా
నువ్వేమి కోరుకున్నా తెచ్చి ఇవ్వనా…
ఆ నింగి చుక్కలన్నీ తెంచి ఇవ్వనా…
తందానా తాళం వేసి నచ్చిందేదో పాడుకుంటూ
చిందేసి సందడి చేద్దాం కన్నా’ అంటూ సాగిందీ గీతం.

వరలక్ష్మీ శరత్ కుమార్, సినిమాలో ఆమె కుమార్తెగా నటించిన నివేక్ష మీద ఈ పాటను తెరకెక్కించారు. కొడైకెనాల్ కొండల్లో అందమైన ప్రదేశాల్లో ఈ పాట చిత్రీకరణ చేశారు. తల్లీ కూతుళ్లు ఇద్దరూ విహార యాత్రకు వెళ్లే సమయంలో పాట వస్తుందని విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతోంది.

‘నా చెయ్యి పట్టుకోవే…’ సాంగ్ విడుదలైన సందర్భంగా నిర్మాత మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ… ”ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారి నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణ. తల్లిగా ఆమె నటించిన తీరు, కుమార్తె కోసం పడే తపన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ గారు తొలిసారి ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేశారు. తల్లీ కుమార్తె మధ్య సన్నివేశాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. కథలో కీలకమైన సందర్భంలో ఈ సాంగ్ వస్తుంది. భావోద్వేగాలతో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మే 3న పాన్ ఇండియా స్థాయిలో భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అని చెప్పారు.

 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus