Na Wife Missing Review in Telugu: నా వైఫ్ మిస్సింగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
- October 22, 2026 / 01:14 PM ISTByFilmy Focus Desk
Cast & Crew
- వరుణ్ సందేశ్ (Hero)
- శ్వేతా బసు ప్రసాద్ (Heroine)
- ప్రవీణ్, సత్యశ్రీ తదితరులు (Cast)
- స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ (Director)
- శివ కంఠంనేని (Producer)
- సాయి కార్తీక్ (Music)
- ఎన్.ఎస్. సతీష్ కుమార్ (Cinematography)
- సాయిబాబు తలారి (Editor)
- Release Date : 22nd అక్టోబర్ 2026
- లైట్ హౌస్ సినీ మ్యాజిక్ (Banner)
కొత్త బంగారు లోకం సినిమాతో యువతరం ప్రేక్షకులను మెప్పించారు వరుణ్ సందేశ్ (Varun Sandesh), శ్వేతా బసు ప్రసాద్ (Shweta Basu Prasad). వీరిద్దరి కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా ఈ మూవీ నిలిచింది. ఈ యూత్‌పుల్ లవ్‌స్టోరీ అనంతరం దాదాపు పద్దెనిమిదేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంటగా నటించిన మూవీ “నా వైఫ్ మిస్సింగ్” (Na Wife Missing). థియేటర్లలో కాకుండా నేరుగా ఆహా ఓటీటీ ద్వారా గురువారం ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ దర్శకత్వం వహించారు. శివ కంఠమనేని నిర్మించారు. నా వైఫ్ మిస్సింగ్ ఎలా ఉంది? కొత్త బంగారు లోకం జోడీ మరోసారి మ్యాజిక్ చేశారా? లేదా? అంటే?
Na Wife Missing Movie Review

కథ: బాలు (Varun Sandesh) గ్రామీణ సప్తగిరి బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తుంటాడు. స్వప్నతో (Shweta Basu Prasad) అతడి పెళ్లి జరుగుతుంది. పెళ్లిచూపుల్లోనే తాను వర్జిన్ కాదని స్వప్న చెబుతుంది. అయినా బాలు ఆమెను పెళ్లిచేసుకుంటాడు. పెళ్లికి ముందే స్వప్న అబాన్ (మోహిత్ పెద్దాడ) అనే యువకుడిని ప్రేమిస్తుంది. తనకంటే వయసులో చిన్నవాడు కావడం, మతం వేరే కావడంతో వారి ప్రేమకు స్వప్న తల్లిదండ్రులు ఒప్పుకోరు. బలవంతంగా బాలుతో ఆమె పెళ్లి జరిపిస్తారు. ప్రియుడు అబాన్‌తో లేచిపోవాలని స్వప్న ప్లాన్ చేస్తుంది. ఆ విషయం బాలుకు తెలుస్తుంది.
ఇష్టం లేకుండా కలిసి బతకడం కష్టమని తేలిపోవడంతో అబాన్‌తో స్వప్న వెళ్లిపోతానని చెప్పిన బాలు కాదనడు. అనూహ్యంగా స్వప్న కనిపించకుండాపోతుంది. ఈ కేసులో బాలును పోలీసులు అరెస్ట్ చేస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన బాలుకు స్వప్న…అబాన్ దగ్గర కూడా లేదనే నిజం తెలుస్తుంది. మరోవైపు ఆమె మిస్సింగ్‌కు బాలు, అబాన్‌లే కారణమని ఎస్ఐ రవి (ప్రవీణ్) అనుమానిస్తాడు. అసలు స్వప్న ఎటు వెళ్లిపోయింది? అబాన్, బాలులలో ఆమె ఎవరిని ప్రేమించింది? వర్జిన్ కాదని చెప్పినా… స్వప్నను బాలు ఎందుకు పెళ్లిచేసుకున్నాడు? స్వప్న మిస్సింగ్‌కు ఎస్ఐ రవికి ఉన్న సంబంధమేమిటన్నదే ఈ మూవీ కథ.

నటీనటుల పనితీరు: కొత్త బంగారులోకం క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో హీరోహీరోయిన్లకు బాలు, స్వప్న అనే పేర్లు పెట్టారు. భార్యను అమితంగా ఇష్టపడే భర్త పాత్రలో వరుణ్ సందేశ్ నటన నాచురల్‌గా ఉంది. స్వప్నగా మల్టీపుల్ షేడ్స్‌తో కనిపించే క్యారెక్టర్‌లో శ్వేతాబసు ప్రసాద్ కనిపించింది. వీరిద్దరి జోడీ బాగుంది. ఛాలెంజింగ్ క్యారెక్టర్లు కాకపోవడంతో ఈజీగా చేసుకుంటూ వెళ్లిపోయారు. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ పాత్రలో కమెడియన్ ప్రవీణ్ నటించాడు. అతడి పాత్రలో వచ్చే ట్విస్ట్ ఈ సినిమాకు కీలకం. జబర్ధస్థ్ సత్యశ్రీ, మోహిత్ పెద్దాడ నటన పర్వాలేదనిపిస్తుంది.

సాంకేతిక వర్ణం పనితీరు: ఫ్యామిలీ ఎమోషన్స్‌కు థ్రిల్లర్ పాయింట్‌ను జోడించి స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ ఈ సినిమాను తెరకెక్కించారు. సొసైటీలో రియలిస్టిక్‌గా జరిగిన సంఘటనల నుంచి స్పూర్తి పొంది రైటర్ ఉమర్జీ అనురాధ ఈ కథను రాసుకున్నారు. తెలిసిన కథనే నాన్ లీనియర్ స్క్రీన్‌ప్లేతో డైరెక్టర్ కొత్తగా చెప్పేందుకు ప్రయత్నించారు. రెండు ట్విస్ట్‌లు మినహా మిగిలినవి థ్రిల్లింగ్‌గా అనిపించవు.
హీరోయిన్ ఆచూకీని హీరో కనిపెట్టే సీన్ కూడా లాజిక్‌లెస్‌గా అనిపిస్తుంది. సాయికార్తీక్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్సయ్యింది. బీజీఎమ్‌తో సస్పెన్స్ ఫీల్‌ను చివరి వరకు కలిగించాడు. రెండు పాటల మెలోడియస్‌గా పర్వాలేదనిపిస్తాయి. సతీష్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. లిమిటెడ్ బడ్జెట్, క్యారెక్టర్లతో ఈ సినిమాను తెరకెక్కించారు నిర్మాత శివ కంఠం నేని. ప్రొడక్షన్ విషయంలో కొన్ని చోట్ల రాజీపడ్డారు.

విశ్లేషణ: ఓటీటీలో మలయాళం ఇన్వేస్టిగేట్ థ్రిల్లర్ సినిమాలకు ఈ మధ్యకాలంలో ఆదరణ పెరుగుతోంది. క్లైమాక్స్ ట్విస్ట్‌ను ఆధారంగా చేసుకొని వాటి చుట్టూ కథలను అల్లుకుంటూ ఆడియెన్స్‌ను మెప్పిస్తుంటారు మలయాళ దర్శకులు. థ్రిల్లర్ సినిమాల ఫార్ములాలోనే నా వైఫ్ మిస్సింగ్ మూవీ రూపొందింది. కేవలం క్లైమాక్స్ ట్విస్ట్‌ను నమ్ముకొని దర్శకురాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ ఒక్క ట్విస్ట్ కోసం మిగిలిన కథ మొత్తం సాగదీశారు. ఆ మలుపు కూడా కొత్తదేమీ కాదు. ఈ పాయింట్‌తో గతంలో తెలుగులో చాలానే సినిమాలు వచ్చాయి.
బాలు స్వప్న పెళ్లి, ఆ తర్వాత వారి గొడవలతో ఫస్ట్ హాఫ్ సాగుతుంది. అబాన్ దగ్గర కూడా స్వప్న లేదనే ఇంటర్వెల్ ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై క్యూరియాసిటీ కలిగించారు. స్వప్న జాడను కనిపెట్టడం కోసం బాలు సాగించే ఇన్వేస్టిగేషన్, ఈ క్రమంలో అసలు విలన్ ఎవరన్నది రివీలయ్యే ఎపిసోడ్‌తో సెకండాఫ్ సాగుతుంది.
రన్ టైమ్ గంట ముప్పై తొమ్మిది నిమిషాలే కావడం ఈ సినిమాకు ప్లస్సయ్యింది. విలన్ పాత్ర విషయంలో దర్శకురాలి ఎంపిక బాగుంది. పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా చూస్తే నా వైఫ్ మిస్సింగ్ పర్వాలేదనిపిస్తుంది.

ఫోకస్ పాయింట్: క్లైమాక్స్ ట్విస్ట్ మినహా మిగిలినదంతా రొటీన్
రేటింగ్: 2/5













