సినిమాకు పేరు పెట్టడం అంత సులభమైన పనేం కాదు. అందులో స్టార్ల సినిమాలకు పేర్ల విషయానికి వస్తే అది ఇంకా కష్టం. అలాంటి కష్టాలు ఏవీ పడకుండా చిన్న కోడ్ నేమ్, వర్కింగ్ టైటిల్స్‌తో సినిమాలు మొదలుపెట్టేస్తుంటారు కొందరు. అలాంటి సినిమాలు ఇటీవల కాలంలో చెప్పాలంటే ‘ఆర్ఆర్ఆర్’. రామారావు- రాజమౌళి- రామ్‌చరణ్ అనే అర్థం వచ్చేలా తొలుత ‘ఆర్ఆర్ఆర్’ అనే వర్కింగ్ టైటిల్ ఇచ్చారు. ఆ తర్వాత అదే పేరు అయ్యింది.
ఇప్పుడు ప్రభాస్ సినిమా విషయంలో కూడా నాగ్ అశ్విన్ అదే పంథాలో నడుస్తున్నాడని అర్థమవుతోంది. సినిమాను ఇటీవల అధికారికంగా ప్రారంభించారు. అయితే అది ట్రయల్ షూట్ అనే విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో సినిమాకు ‘ప్రాజెక్ట్ కె’ అనే పేరు పెట్టారు. దానికి సంబంధించిన క్లాప్‌బోర్డు ఫొటోను చూపించి సినిమా షూట్ స్టార్ట్ అన్నారు. అయితే సినిమా పేరు ఇప్పటికే సిద్ధమైందట. దానిని రివీల్ చేయుండా ఇలా ‘ప్రాజెక్టు కె’ అని పెట్టారట.
చిత్రబృందం విడుదల చేసిన క్లాప్‌బోర్డు ఫొటో చూస్తే… ‘ప్రాజెక్టు కె’ అనే అక్షరాల కింద, దానికి కింద బాక్స్‌ల పక్కన వేరే అక్షరాలు ఏవో ఉన్నట్లు కనిపిస్తోంది. అసలు క్లాప్‌బోర్డు మీద ఏదో స్టిక్కర్ అతికించినట్లుగా ఉంది. అసలు క్లాప్‌బోర్డు కనిపించకుండా ఈ ‘ప్రాజెక్టు కె’ బోర్డు ఫొటో బయటకు ఇచ్చారు అనే గుసగుసలు టాలీవుడ్లో వినిపిస్తున్నాయి. సినిమా పేరు చెప్పకుండా ఇలా ‘కె’ అనే లెటర్‌తో హైప్ క్రియేట్ చేసే ఉద్దేశం అట. సినిమా పేరు ‘కె’తో ఉంటుందని టాక్.