నేటి యువ హీరోలు ఒక్కో సినిమాలో ఒక్కో హీరోయిన్ తో జత కడుతున్నారు. ప్రతి సినిమాకు కొత్త కథానాయకులను ఎంపిక చేసుకునే వారు లేకపోలేదు. హిట్ ఇచ్చిన జోడీ కూడా మూడు సార్లకు మించి కలిసి నటించడానికి ఆసక్తి చూపించడం లేదు. అలాంటిది యువ సామ్రాట్ నాగ చైతన్య నాలుగో సారి సమంతను స్క్రీన్ పార్టనర్ గా ఒప్పుకున్నాడు.
వీళ్లిద్దరూ తొలిసారి “ఏ మాయ చేసావే” సినిమాతో రీల్ ప్రేమికులుగా పేరు తెచ్చుకున్నారు. తర్వాత ఆటోనగర్ సూర్య లో మంచి జంటగా పేరు తెచ్చుకున్నారు. ముచ్చటగా మూడో సారీ “మనం” సినిమాలో జత కట్టి సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్నారు. వీరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుండడంతో దర్శకులు మళ్లీ మళ్లీ ఈ జోడీని తెరపై చూపించాలని ప్రయత్నిస్తున్నారు.
కింగ్ నాగార్జునతో ‘సోగ్గాడే చిన్నినాయనా’ తీసిన దర్శకుడు కల్యాణ్ కృష్ణ తెరకెక్కించనున్న సినిమాలోనూ ఈ హిట్ పెయిర్ నే సెలక్ట్ చేసుకున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో ‘జనతా గ్యారేజ్’ చేస్తోంది. ఆ తర్వాత ఏ సినిమాను ఒప్పుకోలేదు. సమంత, నాగ చైతన్య ప్రేమలో ఉన్నారని వారిద్దరు త్వరలో పెళ్లి చేసుకుంటారని వార్తలు బలంగా వినిపిస్తోంది. ఈ కారణం తోనే నాగచైతన్యతో చివరి సినిమా చేయడానికి సమంత అంగీకరించినట్లు తెలిసింది. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.