ప్రస్తుతం తెలుగులో వస్తున్న అనేక షోల మాదిరిగానే విదేశీయుల ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన షో బిగ్ బాస్. కొన్నేళ్లుగా హిందీ భాషలో ప్రసారమవుతూ విజయాలకు, వివాదాలకు కేంద్ర బిందువైంది. దీనిని గత ఏడాది తెలుగు ప్రేక్షకులకు గత ఏడాది స్టార్ మా ఛానల్ వాళ్ళు పరిచయం చేశారు. మన సంప్రదాయానికి ఈ షో సూటవదు అని చెప్పిన వాళ్లంతా ఈ కార్యక్రమం విజయాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అంతటి ఘనవిజయం సాదించడానికి ప్రధాన కారణం యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ షోకి హోస్ట్ గా వ్యవహరించి తెలుగు వారికి తాను మరింత దగ్గరవుతూ.. షోని దగ్గరి చేశారు. ఈ రియాలిటీ షోపై ఆసక్తి పెంచారు.
ఛానల్ కి వీక్షకులను పెంచారు. ఆ ఉత్సాహంతోనే ఛానల్ వాళ్ళు సీజన్ టు ప్లాన్ చేశారు. ఈ సారి హైదరాబాద్ లోనే భారీ సెట్ వేశారు. కంటెస్టెంట్స్ ని సెలక్షన్స్ చేస్తున్నారు. అయితే ఈ సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడం లేదు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్నట్లు స్టార్ మా ఛానల్ సిబ్బంది నేడు అధికారికంగా ప్రకటించారు. వెండితెరపై సహజమైన నటనతో యూత్ లో క్రేజ్ సంపాదించుకున్న నాని తన మాటలతో బుల్లితెరపైనా కూడా అలరించబోతున్నారు. వందరోజుల పాటు సాగే ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.