లేదు లేదంటూనే ‘పెద్ది’ సినిమాను టాలీవుడ్‌లో టార్గెట్ చేసేశారు. అటు ఎగ్జిబిటర్లు, ఇటు నిర్మాతలు ‘పర్సంటేజీ’ విధానం గురించి చర్చలు, ఉప చర్చలు జరుగుతూనే ఉన్నాయి. దీంతో ఈ సినిమా తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్‌లో సినిమా పడుతుందా లేదా అనేది తేలడం లేదు. ఈ విషయంలో పరిశ్రమ పెద్దలు మరోసారి కూర్చొని మాట్లాడి విషయం తేల్చేంత పరిస్థితి వచ్చింది. దీనికి కారణం ‘పర్సంటేజీ’ విధానంపై ఇటీవల జరిగిన ఎగ్జిబిటర్ల మీటింగ్‌లో ‘పెద్ది’ని అద్దె విధానంలో రిలీజ్‌కి అంగీకరించం అని తేల్చి చెప్పడమే.
అయితే, ఈ విషయంలో నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు అనేకంటే వార్నింగ్ అని చెప్పొచ్చు. ‘పెద్ది’ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలోని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ సమస్యలు సృష్టించాలనుకోవడం సరికాదని నట్టి కుమార్ అన్నారు. సింగిల్ థియేటర్స్ యజమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారని.. వాటిని చర్చల రీతిలో పరిష్కరించుకోవాలని సూచించారు.
పర్సంటేజీ విధానానికి సంబంధించిన సమస్య పరిష్కారం కోసం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ జోక్యం చేసుకుందని గుర్తు చేసిన నట్టి కుమార్.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌తో ఓ సబ్ కమిటీని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఎగ్జిబిటర్లు అప్పుడు అంగీకరించి, ఇప్పుడు మాట మార్చి ‘పెద్ది’ సినిమా విడుదలకు అడ్డుపడటం ఎంత వరకు సమంజసమని తెలంగాణ ఎగ్జిబిటర్లను నట్టి కుమార్ ప్రశ్నించారు. ఈ క్రమంలో మంగళవారం రాత్రిలోగా ఎగ్జిబిటర్లు ‘పెద్ది’ సినిమా విడుదలకు అడ్డు తప్పుకుంటే ఓకే అని.. లేదంటే బుధవారం నుండి ఫిల్మ్ ఛాంబర్ ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటానని నట్టి కుమార్ ప్రకటించారు.
రాష్ట్రంలో ఇకపై పర్సంటేజీ విధానం పైనే సినిమాలు ఆడిస్తామని తెలంగాణ ఎగ్జిబిటర్లు ఇటీవల స్పష్టం చేశారు. ఈ క్రమంలో ‘పెద్ది’ సినిమాకు మినహాయింపు లేదని, ఆ సినిమాకు పర్సంటేజీ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.