మాజీ హీరోయిన్ నేహా ధూపియా త్వరలోనే రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో అభిమానులంతా ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఓ నెటిజన్ మాత్రం ఆమెని ఓ చెత్త కోరిక కోరాడు. ఈసారి బిడ్డకు జన్మనిచ్చిన తరువాత బిడ్డకు పాలు పెడుతున్న వీడియోను షేర్ చేయమని ఓ నెటిజన్ కోరాడు. ఆ పోస్ట్ చూసిన వెంటనే నేహాకు కోపం వచ్చింది. అతడిని ధీటుగా బదులిచ్చింది.
అలాంటి వీడియో కావాలంటే తనను అడగాల్సిన అవసరం లేదని.. మీ అమ్మ లేదా అమ్మమ్మను అడిగితే వాళ్లు చూపిస్తారంటూ గట్టిగా బదులిచ్చింది. సదరు నెటిజన్ తన మూడ్ మొత్తం చెడగొట్టాడని చెప్పిన నేహా.. సాధారణంగా ఇలాంటి నెగెటివ్ పోస్ట్ లను డిలీట్ చేయడం లేదా వదిలేయడం చేస్తానని.. కానీ ఈ నెటిజన్ పెట్టిన పోస్ట్ ను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సమాధానం ఇచ్చినట్లు చెప్పింది. మాతృత్వాన్ని కూడా కామంతో చూసే ఇలాంటి వాళ్లు ఉన్నంతవరకు సమాజం బాగుపడదని నేహా మండిపడింది.
తొలిసారి తల్లి అయిన యువతులు పాలిచ్చే సమయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారని.. ఆ ఇబ్బందులను గుర్తించి, వాళ్లకు సహకారం అందించేలా సమాజం మారాలని హితవు పలికింది.