Siddu Jonnalagadda: సుకుమార్‌ అడ్డా నుండి మరో డైరక్టర్‌… సిద్ధు జొన్నలగడ్డ పని చేయనిస్తాడా?

‘డీజే టిల్లు’, ‘టిల్లు స్క్వేర్‌’ సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్నా, అడపాదడపా ఆకట్టుకునే సినిమాలు చేసినా ఆశించిన గుర్తింపు అందుకోలేకపోయిన సిద్ధు.. ‘టిల్లు’ అయ్యాక కావాల్సినంత క్రేజ్‌ సంపాదించుకున్నాడు. అయితే ఆ తర్వాత విన్నింగ్‌ ట్రాక్‌ నుండి పక్కకు జరిగిపోయాడు. ఎంచుకునే ఏ కథా మామూలుగా విజయాన్ని కూడా అందించలేదు. దీంతో చకోర పక్షిలా హిట్‌ కోసం చూస్తున్నాడు.

Siddu Jonnalagadda

విజయాలు రాకపోవడానికి చాలా కారణాలు బయటకు వస్తున్నాయి. కొన్ని ఆయనే మీడియా ముఖంగా చెబుతున్నాడు కూడా. వాటి సంగతి ఆఖరున చూద్దాం. ఇప్పుడు హిట్‌, కొత్త సినిమా సంగతి చూస్తే.. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ వెబ్‌సిరీస్‌ చేస్తున్నాడు. అలాగే ఆర్‌ఎస్‌జే స్వరూప్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు మరో సినిమాను ఓకే చేశాడట. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ నిర్మాణంలో సిద్ధు ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాతో సుకుమార్‌ సోదరుడి కుమారుడు బాబీ దర్శకుడిగా పరిచయం అవుతారని సమాచారం.

త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటిస్తారు. సుకుమార్‌ నుండి ఇప్పటివరకు చాలామంది దర్శకులు వచ్చారు. అయితే కుటుంబ సభ్యుల నుండి ఎవరూ రాలేదు. సిద్ధుతో సినిమా ద్వారా ఆ పని చేస్తున్నారు అంటే కథ మీద సుకుమార్‌ గట్టి స్క్రూట్నీనే చేసి ఉంటారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే.. దర్శకుడు ఎలాంటి కథ అనుకున్నా, రాసుకున్నా.. సిద్ధు జొన్నలగడ్డ తన మీటర్‌లోకి ఆ సినిమాను తెచ్చుకుంటారు.

గత సినిమాలు ‘జాక్‌’, ‘తెలుసు కదా’ విషయంలో ఇదే జరిగింది అని అంటారు. నా మీద నమ్మకం పెట్టుకుని నిర్మాత సినిమా చేస్తున్నారు.. ఆ మాత్రం కథ విషయంలో జాగ్రత్త లేకపోతే ఎలా అని తన ప్రమేయాన్ని బలపరుచుకుంటూ ఉంటాడు సిద్ధు. మరిప్పుడు బాబీ తాను అనుకున్నట్లుగా డైరెక్ట్‌ చేసే అవకాశం ఇస్తారా? లేక తన ‘జాగ్రత్త’ చూపిస్తాడా అనేది చూడాలి.

ప్రకాశ్‌రాజ్‌ పై మరోసారి బ్యాన్‌ తప్పదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus