సినిమా సెట్‌లోకి హీరో కానీ, హీరోయిన్ కానీ ఎంటర్ అయ్యేటప్పుడు.. సెట్‌లో అందరినీ పలకరిస్తూ వస్తారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సినిమా బీటీఎస్ వీడియోల్లో కనిపిస్తూ ఉంటాయి. సినిమా తారలు కూడా తమ ఇంటర్వ్యూల్లో ఈ విషయాలు చెబుతూ ఉంటారు. ‘ఆ హీరో సెట్స్‌లోకి రాగానే పాజిటివిటీ వచ్చేసేది’ అని.. ‘ఆ హీరోయిన్ సెట్స్‌లో అందరితో కలుపుగోలుగా ఉండేది’ లాంటి మాటలు వినే ఉంటారు. కానీ ఓ హీరోయిన్‌కి సెట్స్‌లో విచిత్ర పరిస్థితి ఎదురైందట.
ఆ సినిమానే ‘టాక్సిక్’. యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమే ఇది. ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ సినిమాలో కియారా అడ్వాణీ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. ‘టాక్సిక్’ సినిమా సెట్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని కియారా చెప్పుకొచ్చింది. సెట్‌లోకి అడుగుపెట్టగానే ఎవరికీ ‘హాయ్, హలో’ చెప్పొద్దని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ చెప్పారని కియారా చెప్పుకొచ్చింది.
సాధారణంగా కియారా సెట్‌లోకి రాగానే అందరినీ పలకరిస్తూ వెళ్తుందట. గుడ్ మార్నింగ్ అంటూ ఉత్సాహంగా మాట్లాడుతుందట. కానీ గీతూ మోహన్‌దాస్ ఒకసారి ఫోన్ చేసి.. ‘రేపు నువ్వు సెట్‌కి వచ్చేటప్పుడు ఆ పాత్రలోనే ఉండాలి’ అని చెప్పారట. ఎలాంటి మర్యాదలు, పలకరింపులు వద్దు. నువ్వు నేరుగా ఆ క్యారెక్టర్ మూడ్‌లోకి వచ్చేయాలి. నీ టీమ్‌తో సహా ఎవరికీ హాయ్, హలో చెప్పొద్దు అని గీతూ చెప్పారట. సెట్‌లో ఉన్నప్పుడు పూర్తిగా నీ పాత్ర గురించే ఆలోచించాలి అని తెలిపారట.
ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నదియా పాత్రలో కియారా కనిపించనుంది. ఆమె పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుందని, అందుకే మూడ్ ఏ మాత్రం మారకుండా ఉండేలా చూసుకోవడానికి ఎవరికీ హాయ్‌లు, హలో చెప్పొద్దు అని అన్నారని కియారా చెప్పుకొచ్చింది. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. పశ్చిమాసియాలో అనిశ్చితి కారణంగా సినిమా విడుదలను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.