ఈ రోజుల్లో శతాధిక చిత్రాలు చేయడమే గగనం. అలాంటి అరుదైన ఘనతను దక్కించుకున్న అతికొద్దిమందిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) తెరకెక్కిస్తున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రం బాలయ్యకి వందో చిత్రమన్న సంగతి తెలిసిందే. తెలుగు చక్రవర్తి ‘శాతకర్ణి’ కథతో రూపొందుతోన్న ఈ సినిమాని 2017 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. నేటితో కలుపుకుని ఈ సినిమా విడుదలకు సరిగ్గా 99 రోజులుంది. ఈ సందర్బంగా బాలయ్య అభిమానులు ఓ సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు.
బాలకృష్ణ నటించిన తొంబై తొమ్మిది సినిమాలను ఒక్కొక్కటిగా ఈ 99 రోజులు ప్రదర్శించనున్నారు. ‘లెజెండ్’ సినిమా 900 రోజులు ప్రదర్శించబడిన ప్రొద్దుటూరు లోని అర్చన థియేటర్ ఇందుకు వేదిక కానుంది. తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో బాలయ్య నటించిన తొలి చిత్రం ‘తాతమ్మ కల’ సినిమాతో ఈ ప్రదర్శనలు నేటి నుండి ఆరంభం కానున్నాయి. ఒకటిరెండు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన నందమూరి హరికృష్ణ సైతం ఇదే సినిమాతో పూర్తిస్థాయి నటుడిగా ఎంట్రీ ఇవ్వడం విశేషం. జనవరి 11 వరకు జరుగనున్న ఈ ప్రత్యేక ప్రదర్శనల అనంతరం 12న ‘శాతకర్ణి’ విడుదల కానుంది. ఈ సినిమాకి ఇంతకుమించిన ప్రచారం మరొకటి ఏముంటుంది. గతంలో శతాధిక చిత్రాలు చేసిన నటులెవ్వరికీ ఇటువంటి ఘనత దక్కలేదు. దాంతో ఈ ప్రయత్నాన్ని లిమ్కా బుక్ రికార్డులకు పంపాలని అభిమానులు ప్రయత్నిస్తున్నారు.