Niharika Nm: తెలుగులో నో హిట్.. తమిళంలో హిట్.. నెక్స్ట్ బాలీవుడ్‌లో ఏమొస్తుందో?
- July 13, 2026 / 05:50 PM ISTByFilmy Focus Desk
అందం, క్రేజ్, అభినయం.. ఈ మూడు ఉంటే సినిమాల్లో రాణించడం అమ్మాయిలకు పెద్ద విషయం కాదు అని అనుకుంటారు. ఆ మాట నిజమే కానీ.. వీటితోపాటు కథల ఎంపిక విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ పట్టు తప్పితే ఎంత కష్టపడినా విజయం రాదు. పైన చెప్పినవేవీ పనిచేయవు. దీనికి రీసెంట్ ఉదాహరణ చెప్పాలంటే ప్రముఖ డిజిటల్ కంటెంట్ క్రియేటర్ నిహారిక.ఎన్‌ఎం పేరు చెప్పాలి. తెలుగులో చేసింది ఒక్క సినిమానే అయినా.. విజయం అందుకోలేకపోయింది.
Niharika Nm
అయితే, తమిళంలో చేసిన రెండు సినిమాలతోనూ విజయం సాధించడం గమనార్హం. ఇటీవల విడుదలైన ‘ఇదయం మురళి’/ ‘హృదయం మురళి’ సినిమాతో మరో విజయం అందుకుంది నిహారిక ఎన్.ఎం. దీంతో ఆమెకు తమిళనాట మరిన్ని సినిమా అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆమె నెక్స్ట్ సినిమా హిందీలో రాబోతోంది. అక్కడ తొలిసారి నటించిన ‘భాయ్ తేరా స్టార్ హై’. రాఘవ్ జూయెల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా ఇది.

మరి తెలుగులో అయినట్లు తొలి సినిమా ఇబ్బందిపెడుతుందా? లేక తమిళంలో అయినట్లు విజయం సాధిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. డిజిటల్ మీడియాలో ఓ సమయంలో మహారాణిలా ఉన్న నిహారిక.. ప్రముఖ సెలబ్రిటీలు అందరితో షార్ట్ వీడియోలు చేసింది. ఆమె కోసం హీరోలు, క్రికెటర్లు, సెలబ్రిటీలు అడిగి మరీ షార్ట్స్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.
అయితే, తెలుగులో చేసిన తొలి సినిమా ‘మిత్రమండలి’ ఇబ్బందికర ఫలితం అందుకుంది. అయితే ఇప్పుడు తెలుగులో ఇంకో సినిమా చేస్తోంది. అల్లరి నరేశ్ హీరోగా రూపొందుతున్న ‘ఆల్కహాల్’ సినిమాలో నిహారిక ఓ కథానాయిక. మరి ఆ సినిమాతో అయినా విజయం అందుకుంటుందేమో చూడాలి.











