ఈమధ్య వచ్చిన చిన్న సినిమాల్లో కంటెంట్ & సాంగ్స్ తో ఆకట్టుకున్న చిత్రం “నిలవే”. సినిమా విడుదలవుతున్నట్లు కూడా చాలామందికి తెలియకపోయినా.. ప్రమోషనల్ కంటెంట్ చూసిన ప్రేక్షకులు మాత్రం పర్వాలేదు అనుకున్నారు. ఇంతకీ ఈ ప్రేమకథ ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుంది? అనేది చూద్దాం..!!
కథ: జీవితం మీద ఆశ కోల్పోయి.. జీవితానికి చరమాంకం పాడేద్దామని ఫిక్స్ అయ్యి, దాదాపు విఫలయత్నం చేస్తాడు అర్జున్ (సౌమిత్). చావు చివరంచున వ్రేలాడుతున్న తరుణంలో చూసిన అదితి (శ్రేయాసి సేన్) అంటే విపరీతమైన అభిమానం పెంచుకుంటాడు. అప్పటినుండి ఆమెను వెంటాడుతూ, ఆమె మెప్పు పొందడం కోసం నానా తిప్పలూ పడుతుంటాడు.
ఆకాశం సాక్షిగా కలుసుకున్న అర్జున్-అదితిల ప్రేమకథ ఎందుకో పెళ్లి దాకా వెళ్లడానికి ఇబ్బందులు పడుతుంది. ఏమిటా ఇబ్బంది? ఎందుకని అర్జున్ ని అదితి దూరం పెడుతుంది? చివరికి వీళ్లు వందేళ్లు కలిసి బ్రతకగలిగారా? అనేది “నిలవే” కథాంశం.
నటీనటుల పనితీరు: సౌమిత్ కాన్ఫిడెంట్ గా కనిపించాడు. స్క్రీన్ ప్రెజన్స్ & డ్యాన్సులతో అలరించాడు. అయితే.. హావభావాల ప్రకటన విషయంలో మాత్రం తడబడ్డాడు. కోపం, బాధ, ప్రేమ వంటి భిన్నమైన భావాల ప్రకటన విషయంలో పరిణితి అవసరం.
శ్రేయాసి సేన్ చూడ్డానికి అందంగా కనిపించడమే కాక, అభినయంతోనూ అలరించే ప్రయత్నం చేసింది. సినిమాకి హుక్ పాయింట్ & కాన్ఫ్లిక్ట్ పాయింట్ అమ్మాయి పాత్ర మరియు ఆ పాత్ర తాలూకు బాధ. వాటిని మోయడంలో ఇబ్బందిపడింది. మరీ ముఖ్యంగా రివీలింగ్ పాయింట్ లో ఆమె పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ ఎమోషన్ ను ఫీలయ్యేలా చేయలేకపోయింది. అయితే.. ఆమె కొత్త నటి కాబట్టి, తప్పంతా ఆమెది అని కూడా చెప్పలేం. సీన్ కంపోజిషన్ లో, ముఖ్యమైన ఎమోషనల్ సీన్స్ కి ఆమెకు టైట్ క్లోజ్ బ్లాక్స్ పెట్టకుండా మ్యానేజ్ చేయాల్సింది.
హర్ష చెముడు, సుప్రియ ఐసోలా, జీవన్ వంటి ప్యాడింగ్ ఉన్నా.. వాళ్ల పాత్రలకి ఒక క్లారిటీ లేదు. మధ్య మధ్యలో వచ్చి కనబడి వెళ్లిపోతూ ఉంటారు.
సాంకేతికవర్గం పనితీరు: కళ్యాణ్ నాయక్ పాటలు అర్థవంతంగా, వినసొంపుగా ఉన్నాయి. సాహిత్యంలో కథ యొక్క గమనాన్ని వివరించిన విధానం బాగుంది.
దిలీప్ కే కుమార్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది కానీ.. నేచురల్ గా చూపించడం కోసం కొన్ని సీన్స్ లో బేసిక్ లైట్స్ కూడా వాడకపోవడం, కలర్ టోన్ విషయంలో డల్ నెస్ మైంటైన్ చేయడం అనేది చిన్నపాటి డిస్కనెక్ట్ ఎలిమెంట్. మూడ్ కి తగ్గట్లుగా బ్రైట్ & డల్ నెస్ బ్యాలెన్స్ చేయాల్సింది.
దర్శకద్వయం సౌమిత్ & సాయి కవితాత్మకంగా ఓ ప్రేమకథను విజువల్లీ స్టన్నింగ్ ఫార్మాట్ లో చెప్పాలనుకున్న ఆలోచనకి, ఆచరణ లోపించింది. దర్శకుల మస్తిష్కంలో అత్యద్భుతమైన ఆలోచనలు ఉండొచ్చు, కానీ.. అది దృశ్యరూపంలో ప్రేక్షకులకి అందించినప్పుడు.. వాళ్లు ఎంటర్టైన్ & ఎంగేజ్ అవుతున్నారా లేదా అనే విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ప్రేక్షకుడి పాయింటాఫ్ వ్యూ ని కేర్ చేయకుండా కేవలం దర్శకుల పాయింటాఫ్ వ్యూని మాత్రమే సాటిస్ఫై చేసుకుంటూ వెళ్లడం అనేది సినిమాకి మైనస్.
ఆఖరి 15 నిమిషాలవరకు సినిమాలో అసలు కాన్ ఫ్లిక్ట్ పాయింట్ ఏంటి అనేది ప్రేక్షకుడికి ఏమాత్రం అర్థం కాకుండా స్క్రీన్ ప్లే రాసుకోవడం, మధ్యలో వచ్చే సందర్భాలు, సన్నివేశాలు, డ్రామా ఎంగేజ్ చేసే విధంగా లేకపోవడం అనేది ప్రేక్షకుల సహనానికి పరీక్షలా మారింది. అయితే.. ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను ఎక్కడా పరిధి దాటనివ్వకపోవడం, మరీ ఎబ్బెట్టుగా మూతి ముద్దులు చిత్రించకపోవడం అనేది చెప్పుకోదగ్గ విషయం. ఓవరాల్ గా.. దర్శకురచయితలుగా సౌమిత్ & సాయి ఓ మోస్తరుగా మాత్రమే అలరించారు అని చెప్పొచ్చు.
విశ్లేషణ: నీ కథలో ప్రేక్షకుడు లీనమవ్వాలి అంటే.. కీ పాయింట్ ఏంటి అనేది అర్థమవ్వాలి. అదేదో భారీ ట్విస్ట్ లా క్లైమాక్స్ వరకు సాగదీయడం అనేది ఆలోచనాపరంగా కొత్తగా ఉన్నా.. సినిమాగా అలరించలేకపోయింది. ప్రేక్షకుడు ఎందుకు చివరి వరకు కూర్చోవాలి అనేది ముందే హింట్ ఇచ్చి లేదా.. పూర్తిగా వివరించి ఎంగేజ్ చేయాలి. అయితే.. దర్శక ద్వయం సౌమిత్ & సాయి, విజువల్ స్టోరీ టెల్లింగ్ కి ఇచ్చిన ఇంపార్టెన్స్ కథనానికి ఇవ్వలేదు. దాంతో.. టెక్నికల్ గా కాస్త డీసెంట్ గా ఉన్న “నిలవే” చిత్రం ఓ రెగ్యులర్ సినిమాగా మిగిలిపోయింది.
ఫోకస్ పాయింట్: ప్రేమకి ఉన్నంత సహనం ప్రేక్షకుడికి ఉండదు!
రేటింగ్: 2/5