తెలుగు సినిమాలో పదికిపైగా సినిమాలు ఫ్లాప్ అయినా ఇండస్ట్రీలో ఇంకా నిలబడి హిట్ సినిమాలు ఇచ్చిన హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో నితిన్ ఒకడు. కెరీర్ ప్రారంభంలోనే స్టార్ దర్శకులతో సినిమా అవకాశాలు సంపాదించిన నితిన్.. రాజమౌళి సినిమా ‘సై’ తర్వాత వరుస పరాజయాలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత కోలుకొని హిట్ ట్రాక్ ఎక్కాడు. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితిలోనే ఉన్నాడు. నితిన్‌కి హిట్ వచ్చి ఐదేళ్లు అవుతోంది.
వరుసగా రెగ్యులర్ సినిమాలు చేస్తూ వచ్చిన నితిన్.. ఇప్పుడు పూర్తిగా జోనర్‌లు మార్చే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో వీఐ ఆనంద్ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా పూర్తి కాకుండానే మరో రెండు కథలను ఓకే చేసి, సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడట. అందులో ఒక హిట్ సినిమా దర్శకుడు ఉండగా.. మరొకరు కొత్త దర్శకుడు అని సమాచారం.
‘ఆయ్’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు అంజి. ఆయన ఇటీవల చెప్పిన కథకు నితిన్ ఓకే చెప్పారని టాక్. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ్ మూవీస్‌లోనే ఈ సినిమాను నిర్మించనున్నట్లు తెలిసింది. సంక్రాంతికి సినిమాను తెచ్చేలా ఆయన ప్లాన్స్ చేస్తున్నారట. ఇదిలా ఉండగా ఆయనతో గతంలో ఓ సినిమాకు డైరక్షన్ టీమ్‌లో ఉన్న కొత్త కుర్రాడు కథ చెప్పి ఓకే చేయించుకున్నారని లేటెస్ట్ టాక్.
‘ఆయ్’ అంజి సినిమా చిత్రీకరణ ఈ జులై నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈలోగా వీఐ ఆనంద్ సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారట. ఆ తర్వాత కొత్త దర్శకుడితో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నట్లు భోగట్టా. ఈ సినిమాను వచ్చే నెలలో ప్రకటిస్తారట. అయితే అంజి సినిమా కంటే ముందే ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశమూ ఉందంటున్నారు.