హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఆదర్శ్.. సరైనోడు, పీవీఎస్ గరుడవేగా వంటి అనేక సినిమాలతో తెలుగు సినీ అభిమానులకు దగ్గరయ్యారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ లోను 70 రోజుల పాటు హౌస్ లో ఉండి బుల్లితెరప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నారు. నెగటివ్ రోల్స్ చేస్తున్నప్పటికీ ఎక్కువమంది అభిమానులను సంపాదించుకున్నారు. తాజాగా అతను చేసిన ఓ పని ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పూజా హెగ్డే, ఈషా రెబ్బా హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆదర్శ్ కూడా ఓ రోల్ చేస్తున్నారు.
రీసెంట్ గా షూటింగ్ లో అతను జాయిన్ అయ్యారు. ఆ సందర్భాన్ని తన ఫాలోవర్స్ తో పంచుకుందామని తన ట్విట్టర్ వేదికపై ఓ పోస్ట్ చేశారు. “త్రివిక్రమ్ సార్ తో కలిసి పనిచేసే కల నెరవేరింది. ఎన్టీఆర్ తో కలిసి నటించడంతో ఈ ఆదివారం మరింత ప్రత్యేకమైంది” అంటూ ముగ్గురు కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ఇందులో అతను ఎన్టీఆర్ ని సంభోదించిన విధానం అభిమానులకు నచ్చలేదు. ఏదో ఫ్రెండ్ ని పిలిచినట్టు ఎన్టీఆర్ అని ట్వీట్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. “మాకు ఎన్టీఆర్ దేవుడు. అతన్ని ఎన్టీఆర్ సార్, లేక ఎన్టీఆర్ గారు అని పిలవాలి. ఇలా పిలిచావంటే బాగుండదు” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. తారక్ అభిమానుల ఆగ్రహాన్ని ఆదర్శ్ ఏవిధంగా తగ్గిస్తారో చూడాలి.