బాలయ్య ప్రస్తుతం కే.ఎస్.రవికుమార్ డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని నిర్మాత సి.కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల హడావిడి ఎలాగు ముగిసింది కాబట్టి రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనడానికి బాలయ్య రెడీ అవుతున్నారు. మరోపక్క బాలయ్యతో ఎలాగైనా సినిమా చేయాలని మాస్ డైరెక్టర్ బోయపాటి గట్టి కసరత్తులే చేస్తున్నాడు. అయితే రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేయడానికి బాలయ్య ఇంట్రెస్ట్ చూపించడం లేదట.
తన వయసుకి తగినట్టుగా సూటయ్యే పాత్రల కోసమే బాలయ్య చూస్తున్నాడట. ఈ క్రమంలో ఓ మల్టీస్టారర్ చేయాలని కూడా ప్లాన్ చేస్తున్నాడట. ఆ చిత్రంలో నందమూరి హీరోలంతా కలసి నటిస్తే బాగుంటుందని దర్శక నిర్మాతలకి చెబుతున్నాడట. అంటే బాలయ్య ‘మనం’ లాంటి కథ కోసం ట్రై చేస్తున్నాడన్న మాట. అక్కినేని హీరోలంతా కలసి ‘మనం’ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అదే తరహాలో జూ. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తో కలసి బాలయ్య నటించే విధంగా కథని రెడీ చేయమని దర్శక నిర్మాతలకి చెబుతున్నాడని ఆయన సన్నిహితులు చెప్పుకొస్తున్నారు. అయితే ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ పెద్ద స్టార్ హీరో… ముఖ్యంగా ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని తగినవిధంగా కథ రావాలని లేకపోతే తేడా కొట్టే ప్రమాదం ఉందని కొందరు రచయితలు బాలయ్యకు సూచించారట. ఈ విషయం బాలయ్యకు పెద్ద తలనొప్పిగా మారిందని ఫిలింనగర్లో టాక్ వినిపిస్తుంది.