టెంపర్ నుంచి సినిమాకి సినిమాకి కథల ఎంపికలోనే కాదు.. మేకోవర్ పైన యంగ్ టైగర్ దృష్టిపెట్టారు. ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించడానికి శ్రమించారు. ఆ కష్టం వృధాపోలేదు. హిట్ రూపంలో అతనికి తిరిగి వస్తోంది. ఇలా వరుసగా నాలుగు విజయాలను అందుకున్న ఎన్టీఆర్.. జై లవకుశ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు నెలలక్రితం పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ మూవీ ఈ నెల మూడో వారంలో సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందులో తారక్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టు సమాచారం. ఈ పాత్రకోసం బాడీ చాలా ఫిట్ గా ఉండాలని డైరక్టర్ చెప్పగానే.. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు జిమ్ లోనే ఎక్కువ సేపు గడిపి లుక్ ను పూర్తిగా మార్చేశారు.
ఆ లుక్ కి సంబంధించిన ఫోటోలు నిన్న సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. వీటిని చూసిన అభిమానులు ఆనంద పడుతున్నారు. సినీ విశ్లేషకులు తారక్ పై అభినందనల వర్షం కురిపిస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సంతోషపెట్టడానికి ఎంత రిస్క్ చేయడానికైనా వెనుకాడని మరో సారి నిరూపించారంటూ ప్రశంసిస్తున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించనున్నఎన్టీఆర్ 28 వ సినిమాకి థమన్ సంగీతమందించడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇందులో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే, శ్రద్ధ కపూర్ లు నటించనున్నట్టు సమాచారం. ఈ కొత్త కాంబినేషన్ సరికొత్త అనుభూతిని అందించక మానదు.