యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం “పంతం”. రైటర్ టర్నడ్ డైరెక్టర్ చక్రవర్తి తెరకెక్కించిన ఈ చిత్రంలో గోపీచంద్ సరసన మెహరీన్ కథానాయికగా నటించగా.. సోషల్ మెసేజ్ తో కూడిన కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి గోపీచంద్ ఆ అంచనాలను అందుకోగలిగాడా? ప్రేక్షకులను సంతుష్టులను చేయగలిగాడా లేదా? అనేది సమీక్ష చదివి తెలుసుకోండి..!!
కథ :
వీరు (గోపీచంద్) ఓ మంచి దొంగ.. మినిస్టర్స్ ప్రజల దగ్గర దోచుకున్న సొమ్మును తన తెలివి ఉపయోగించి తన స్నేహితుడు (శ్రీనివాసరెడ్డి) తో కలిసి వారి దగ్గర కొట్టేసి.. సామాన్యులకు, అవసరార్ధులకు అందేలా చేయడం అతడి హాబీ. ఈ హాబీ కారణంగా అందరి మినిస్టర్స్ కంటే ఎక్కువగా హోమ్ మినిస్టర్ నాయక్ (సంపత్) బాగా ఎఫెక్ట్ అవుతుంటాడు. అయితే.. వీరు మినిస్టర్ నాయక్ ను టార్గెట్ చేయడం వెనుక ఓ పెద్ద కారణం ఉందని, అసలు వీరు అందరూ అనుకొంటున్నట్లుగా దొంగ కాదని తర్వాత తెలుస్తుంది. అసలు వీరు ఎవరు? అతని బ్యాగ్రౌండ్ ఏంటి? నాయక్ ని టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటి? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “పంతం” చిత్రం.
నటీనటుల పనితీరు :
ఆల్రెడీ ఈ తరహా పాత్రలు పోషించిన గోపీచంద్ కి ఈ చిత్రంలో రెండు విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. పైగా.. మునుపటి చిత్రం “గౌతమ్ నంద” షేడ్స్ కాస్త ఎక్కువగా ఉండడంతో ఇంకాస్త సులువైంది. కోర్ట్ సీన్ లో మాత్రం తనలోని నటుడ్ని సంతృప్తి పరచడంతోపాటు.. ప్రేక్షకుల్ని కూడా మెప్పించాడు గోపీచంద్. కాకపోతే.. రెగ్యులర్ గా ఫైట్స్ సీన్స్ తో మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకొనే గోపీ ఈ సినిమాలో మాత్రం సరైన టెక్నికాలిటీస్ లేకపోవడంతో కాస్త నిరాశపరిచాడనే చెప్పాలి.
మెహరీన్ మొదటి చిత్రమైన “కృష్ణగాడి వీరప్రేమగాధ”లో కనిపించినంత అందంగా, ఒద్దికగా మళ్ళీ కనిపించలేకపోయింది. ఈ చిత్రా షూటింగ్ సమయంలోనే సన్నబడడానికి ప్రయత్నిస్తుందేమో కానీ ఒక్కో సన్నివేశంలో ఒకలా కనిపించింది. పాటల్లో అమ్మాయిని టైట్ క్లోజ్ షాట్స్ మరీ ఎక్కువగా పెట్టేశారేమో అనిపిస్తుంది. లిప్ సింక్ కుదరక, అందంతో ఆకట్టుకోలేక, అభినయంతో అలరించలేక నానా ఇబ్బందులూ పడింది మహారీన్.
సంపత్, శ్రీనివాసరెడ్డి, ఆశిష్ విద్యార్ధి, ప్రభాస్ శ్రీను, జయప్రకాష్ రెడ్డి వంటి ఆర్టిస్టులు తమ స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకోగలిగారు కానీ.. సరైన క్యారెక్టరైజేషన్స్ లేక వారి పాత్రలు ప్రేక్షకులని పెద్దగా ఎంటర్ టైన్ కానీ ఎంగేజ్ కానీ చేయలేకపోయాయి.
సాంకేతికవర్గం పనితీరు :
సాధారణంగా గోపీసుందర్ సరదాగా కట్టిన ట్యూన్స్ కూడా కాస్తో కూస్తో ఆకట్టుకొంటుంటాయి. కానీ.. మొదటిసారిగా “పంతం” సినిమాలో పాటలు మాత్రం ఒక్కటంటే ఒక్కటి కూడా వినసోంపుగా, చూసి ఆనందించదగిన విధంగా లేకపోవడంతో గోపీసుందర్ సంగీత దర్శకుడిగా విఫలమయ్యాడు. నేపధ్య సంగీతం కూడా తమన్ నుంచి అరువు తెచ్చినట్లుగా “సరైనోడు” థీమ్ మ్యూజిక్ నే కాస్త అటుఇటు తిప్పి వాడేయడం గమనార్హం.
సీనియర్ సినిమాటోగ్రాఫర్ ప్రసాద్ మూరెళ్ళ పనితనం, కష్టం సినిమాకి పెద్దగా ప్లస్ అవ్వలేకపోయింది. ఆయన ఈ చిత్రం మేకింగ్ కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యారన్న విషయాన్ని చిత్రబృందం అందరూ చాలా గర్వంగా చెప్పుకొన్నారు. కొన్ని స్టాండర్డ్ షాట్స్ మినహా పెద్దగా ఆకట్టుకొనే కెమెరా వర్క్ కూడా ఎక్కడా కనిపించలేదు.
ఈ తరహా థ్రిల్లర్స్ కి కావాల్సింది సరైన స్క్రీన్ ప్లే తోపాటు చక్కటి డీలింగ్. రైటర్ టర్నడ్ చక్రవర్తి “పంతం” కథ బాగా రాసుకొన్నాడు, మంచి ట్విస్టులతో స్క్రీన్ ప్లే కూడా బాగానే డిజైన్ చేసుకొన్నాడు. కానీ.. సినిమా డీలింగ్ విషయంలో తేడా కొట్టేసింది. ఇది ట్విస్టా అని ప్రేక్షకుడి మైండ్ లోకి సినిమా ఎక్కేలోపే ఆ ట్విస్ట్ ను ఎండ్ చేసేయడం, ముఖ్యంగా సన్నివేశాల్లో ఎక్కడా బలం లేకపోవడంతో ప్రేక్షకుడు సినిమాలో లీనమవ్వడు.
పోనీ.. కమర్షియల్ సినిమా కాబట్టి ఫైట్స్, సాంగ్స్, కామెడీ అయినా ఎంజాయ్ చేద్దామా అంటే వాటికి కూడా సరైన ప్లేస్ మెంట్ లేదు. పైగా.. చిత్రీకరణలో పట్టు లేకపోవడంతో సన్నివేశాలు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోవు. ఒక్క కోర్ట్ సీన్ & ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ మినహా సినిమాలో ఆకట్టుకొనే అంశాలేవీ లేకపోవడంతో ప్రేక్షకుడు పెద్దగా ఎగ్జైట్ అవ్వడు. బాబీ లేదా గోపీచంద్ మలినేని అయితే ఈ కమర్షియల్ సబ్జెక్ట్ ను బాగా హ్యాండిల్ చేయగలిగేవారేమో.
విశ్లేషణ :
సినిమాలో హీరోయిజం, కామెడీ, ఫైట్స్, సాంగ్స్, కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. అవేవీ సరిగ్గా ఆకట్టుకోకపోవడంతో “పంతం” యావరేజ్ సినిమాగా మిగిలిపోతుంది. నిజానికి గోపీచంద్ కెరీర్ లో మైలురాయి చిత్రం లాంటి 25వ చిత్రమైన “పంతం” రిజల్ట్ పరంగా మాత్రం మైలురాయిగా నిలవలేకపోయింది.
రేటింగ్: 1.5/5