They Call Him OG Review in Telugu: దే కాల్ హిమ్ ఓజీ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • పవన్ కళ్యాణ్ (Hero)
  • ప్రియాంక అరుల్ మోహన్ (Heroine)
  • ప్రకాష్ రాజ్, ఇమ్రాన్ హష్మీ, శ్రేయా రెడ్డి, శుభలేఖ సుధాకర్, అర్జున్ దాస్, హరీష్ ఉత్తమన్ (Cast)
  • సుజీత్ (Director)
  • డివివి దానయ్య - కళ్యాణ్ దాసరి (Producer)
  • తమన్ (Music)
  • రవి కె.చంద్రన్ - మనోజ్ పరమహంస (Cinematography)
  • నవీన్ నూలి (Editor)
  • Release Date : సెప్టెంబర్ 25, 2025
  • డివివి ఎంటర్టెన్మెంట్స్ (Banner)

పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా “ఖుషీ” తర్వాత ఆ స్థాయి క్రేజ్ సంపాదించుకున్న సినిమా “ఓజీ”. ఈ సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ నుండి భీభత్సమైన క్రేజ్ క్రేజ్ ఏర్పడింది. ఫ్యాన్స్ అందరూ మిగతా పవన్ సినిమాల కంటే ఈ చిత్రం మీదే గురిగా ఉన్నారు. దానికి తగ్గట్లే ప్రమోషనల్ కంటెంట్ కూడా మంచి హైప్ పెంచింది. రెండు సినిమాల అనుభవం ఉన్న సుజీత్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేశాడు? పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలను ఈ చిత్రం అందుకోగలిగిందా? అనేది చూద్దాం..!!

They Call Him OG Movie Review

కథ: సత్య దాదా (ప్రకాష్ రాజ్)కి అండగా నిలబడి, అతడు ముంబైలో పోర్ట్ ను దక్కించుకునేందుకు సహాయపడిన గంభీర అలియాస్ ఓజీ (పవన్ కళ్యాణ్) కొన్నాళ్లుగా ముంబైకు, సత్య దాదాకు దూరంగా మధురైలో మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ గా ఇష్టపడి పెళ్లి చేసుకున్న కన్మణి (ప్రియాంక అరుల్ మోహన్)తో సంతోషంగా జీవిస్తుంటాడు.

కానీ.. ముంబైలో చీకటిరాజ్యపు రక్కసులు మాత్రం అతడ్ని వెంటాడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు.

అసలు గంభీర ఎవరు? అతనికి జపాన్ తో ఉన్న కనెక్షన్ ఏమిటి? ముంబై పోర్ట్ లో ఉన్న ఏ వస్తువు కోసం బడా డాన్ లు అందరూ రంగంలోకి దిగుతారు? వాటిని గంభీర ఎలా ఎదుర్కొన్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఓజీ” చిత్రం.

నటీనటుల పనితీరు: “ఖుషీ” తర్వాత పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్స్ “ఓజీ” అని చెప్పొచ్చు. 80’s టైంలైన్ లో పవన్ కళ్యాణ్ ను ప్రెజంట్ చేసిన తీరు ఫ్యాన్స్ కు ఫుల్ ఫీస్ట్. అలాగే.. పవన్ కళ్యాణ్ కూడా తన మొహమాటాన్ని పక్కన పెట్టి.. ఈ సినిమాలో చాలా ఫ్రీగా నటించిన తీరు, ఒరిజినల్ ఆటిట్యూడ్ ను ప్రదర్శించిన విధానం ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించడం ఖాయం. అసలు ఇన్నాళ్లు ఇలాంటి పవన్ కళ్యాణ్ ను వేరే దర్శకులు తెరపై ఎందుకు ప్రెజెంట్ చేయలేకపోయారు? అని తప్పకుండా ఆలోచిస్తారు అభిమానులు.

ఇమ్రాన్ హష్మీ క్యారెక్టరైజేషన్ రెగ్యులర్ గానే ఉన్నప్పటికీ.. తనదైన శైలి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. అర్జున్ దాస్ నటన కూడా అలరించింది. శ్రేయా రెడ్డి కనిపించినంతసేపు అందర్నీ డామినేట్ చేసేసింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్స్, కళ్లతో పలికించే భావాలు బాగున్నాయి.

ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్ లు తమ సీనియారిటీతో సినిమాకి వెల్యూ ఎడిషన్ లా నిలిచారు.

సాంకేతికవర్గం పనితీరు: తమన్ ఈ సినిమాకి సెకండ్ హీరో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బీజియం & సౌండ్ మిక్సింగ్ తో ఇరగదీశాడు. ప్రతి సన్నివేశాన్ని తనదైన మార్క్ బీజియం తో ఎలివేట్ చేయడంలో ఎక్కడా తగ్గలేదు తమన్. తమన్ మీసం మెలేయడంలో తప్పే లేదు అనిపించింది.

ప్రొడక్షన్ డిజైన్ & కాస్ట్యూమ్ టీమ్ కష్టాన్ని మెచ్చుకోవాలి. పవన్ కళ్యాణ్ స్టైలింగ్ విషయంలో తీసుకున్న కేర్ అదిరింది. అలాగే.. 80ల నాటి టైమ్ లైన్ ను రీక్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. అలాగే.. సీజీ టీం కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా టైటిల్ కార్డ్ సీక్వెన్స్ ఈమధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు.

సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో ది బెస్ట్ అని చెప్పాలి. కొన్ని ఫ్రేమ్స్ లో పవన్ కళ్యాణ్ ఎంత ఎనర్జిటిక్ గా కనిపించాడో, అంతే మాసీగానూ కనిపించాడు. ఆ క్రెడిట్ కొంచం డి.ఐ టెక్నీషియన్స్ ని కూడా ఇవ్వాలి.

యాక్షన్ బ్లాక్ డిజైన్ చేసిన విధానం అదిరింది. ముఖ్యంగా ఓపెనింగ్ సీక్వెన్స్ లో వచ్చే తెర వెనుక కటానా ఫైట్, ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చే యాక్షన్ సీన్ & సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్స్ అన్నీ చాలా జాగ్రత్తగా, స్టైలిష్ గా డిజైన్ చేసుకున్నారు.

దర్శకుడు సుజీత్ తన అభిమాన నటుడ్ని, ఆయన అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో, అంతకు మించి చూపించాడు. ముఖ్యంగా లక్స్ విషయంలో మాత్రం అస్సలు రాజీపడలేదు. అలాగే.. జపాన్ ను కథలో భాగంగా మలిచిన విధానం ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కి కాస్త టైమ్ తీసుకున్నా.. ఓవరాల్ గా అవసరమే కదా అనిపించాడు. సెకండాఫ్ లో పోలీస్ స్టేషన్ సీక్వెన్స్ ను కంపోజ్ చేసిన విధానం సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. అలాగే.. చాలా సన్నివేశాలను ఫ్యాన్స్ మూమెంట్స్ గా తీర్చిదిద్దిన విధానం మెచ్చుకోవాలి. అయితే.. స్క్రీన్ ప్లే విషయంలో ఎప్పట్లానే మరీ ఎక్కువ సబ్ ప్లాట్స్ ను ఇరికించి, దేనికీ కనెక్ట్ చేయలేక సెకండాఫ్ లో తడబడ్డాడు సుజీత్. సన్నివేశాలు బాగున్నా.. కథగా అలరించలేకపోయాడు. బోలెడన్ని సందేహాలకు సమాధానం ఇవ్వకుండా ముగించడం, చివర్లో చాలావరకు కథను మాటల్లో చెప్పడం, కంగారుగా సినిమాని చుట్టేయడం, అందరూ ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇమ్రాన్ హష్మీ సీక్వెన్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడం అనేది నిరాశపరుస్తుంది. ఆ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే “ఓజీ” పూర్తిస్థాయిలో ఆకట్టుకోగలిగేది. ఓవరాల్ గా మాత్రం దర్శకుడిగా పర్వాలేదనిపించుకుని, ఫ్యాన్ బాయ్ గా మాత్రం అదరగొట్టాడు సుజీత్.

విశ్లేషణ: డ్రామాకి, ల్యాగ్ కి చాలా చిన్న తేడా ఉంటుంది. సన్నివేశాల్లో ఎమోషన్ సరిగా వర్కవుట్ అవ్వకపోతే ఎంత సిన్సియర్ డ్రామా అయినా బోర్ కొడుతుంది. “ఓజీ” విషయంలో అదే జరిగింది. చాలా పెద్ద కథ, లెక్కకుమిక్కిలి పాత్రలు, ఫ్యాన్స్ ను ఆకట్టుకునే క్రేజీ ఫ్యాన్ మూమెంట్స్, తమన్ బీజియం, కంటెంట్ క్వాలిటీ వంటివన్నీ ఉన్నప్పటికీ.. ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం అనేది “ఓజీ”కి మైనస్ గా మారింది. అయితే.. పవన్ కళ్యాణ్ ను ఈమధ్యకాలంలో ఇంత ఎనర్జిటిక్ గా, స్టైలిష్ గా చూడలేదు కాబట్టి, మాస్ మూమెంట్స్ కూడా కావాల్సినన్ని ఉన్నాయి కాబట్టి కచ్చితంగా బాక్సాఫీస్ దగ్గర బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. సుజీత్ స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుని ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సత్తా ఉన్న సినిమా “ఓజీ”.

ఫోకస్ పాయింట్: ఫ్యాన్ చేత, ఫ్యాన్స్ కొరకు!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus