Parakramam Review in Telugu: పరాక్రమం సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 23, 2024 / 01:29 PM IST

Cast & Crew

  • బండి సరోజ్ కుమార్ (Hero)
  • శృతి సమాన్వి (Heroine)
  • నాగలక్ష్మి, వంశీ రాజ్, కిరీటిరాజ్, శశాంక్ వెన్నెలకంటి తదితరులు.. (Cast)
  • బండి సరోజ్ కుమార్ (Director)
  • బండి సరోజ్ కుమార్ (Producer)
  • బండి సరోజ్ కుమార్ (Music)
  • వెంకట్ ఆర్.ప్రసాద్ (Cinematography)

“మాంగల్యం, నిర్బంధం” వంటి ఇండిపెండెంట్ సినిమాలతో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుని కల్ట్ డైరెక్టర్ & యాక్టర్ గా ఎదుగుతున్న ఒక బ్రాండ్ బండి సరోజ్ కుమార్. అతడి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తూ నటించిన తాజా చిత్రం “పరాక్రమం” (Parakramam) . ఒక ఇండిపెండెంట్ సినిమాకి థియేటర్లు దొరకడమే పెద్ద విషయం అనుకుంటున్న సమయంలో దొరికిన కొన్ని ధియేటర్లను 60% ఫుల్స్ చేయడం అనేది ఘనత అనే చెప్పాలి. అలాంటి ఘనత సాధించిన బండి సరోజ్ కుమార్ చిత్రమైన “పరాక్రమం” ఎలా ఉందో చూద్దాం..!!

Parakramam Review

కథ: సమాజంలో తన చుట్టూ జరుగుతున్న తప్పులను చూస్తూ, ఏమీ చేయలేక ఎప్పటికైనా ఒక నాటకం రూపంలో ఆ అన్యాయాలను ఎండగట్టాలని కలలు కన్న కళాకారుడు సత్తిబాబు (బండి సరోజ్ కుమార్), అయితే.. తనలోని లేని తెగువ తన కుమారుడు లోవరాజు (బండి సరోజ్ కుమార్)లో ఉందని గ్రహించి.. మూడు అధ్యాయాలుగా తాను రాసిన “పరాక్రమం” అనే నాటకాన్ని యముడి పాత్రలో పోషించాలని మాట తీసుకొని మరణిస్తాడు.

తండ్రి మాట కోసమో లేక ఇష్టపడిన లక్ష్మి (శృతి సమాన్వి) కోసమో తెలియదు కానీ.. హైద్రాబాద్ లోని రవీంద్రభారతిలో “పరాక్రమం” మొదటి అధ్యాయం నాటకంగా ప్రదర్శించాలని ఫిక్స్ అవుతాడు. అసలు సత్తిబాబు “పరాక్రమం” నాటకం ద్వారా ఏం చెప్పాలనుకున్నాడు? లోవరాజు ఈ నాటకాన్ని ప్రదర్శించడం కోసం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “పరాక్రమం” (Parakramam Review in Telugu) కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమాలో కొత్త నటీనటులు చాలా మంది ఉన్నప్పటికీ.. అందరికంటే ఎక్కువగా ఆకట్టుకున్న వ్యక్తి కిరీటిరాజ్. సూరిబాబు పాత్రలో హీరోకి ఏదో సైడ్ కిక్ లా కాకుండా బ్యాలెన్స్డ్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. చిన్నపాటి వైకల్యం ఉన్న యువతిగా శృతి సమాన్వి చక్కని నటనతో అలరించింది. ఆమె పాత్రకు ఉన్న వెయిటేజ్ ను ఆమె హావభావాలతో పండించింది. నాగలక్ష్మి, వంశీరాజ్, నిఖిల్ తదితరుల పాత్రలు పర్వాలేదనిపించుకున్నాయి.

ఇక బండి సరోజ్ కుమార్ ద్విపాత్రాభినయంతో మెప్పించడానికి ప్రయత్నించినప్పటికీ.. లోవరాజు పాత్రలోనే తనదైన శైలి నటనతో ఆకట్టుకోగలిగాడు. సదరు పాత్ర స్వభావానికి బండి సరోజ్ కుమార్ ఒరిజినల్ క్యారెక్టర్ కూడా కాస్త దగ్గరగా ఉండడంతో, ఆ పాత్రకు అతడిని అభిమానించే వారు మాత్రమే కాక మాస్ ఆడియన్స్ కూడా ఓ మోస్తరుగా కనెక్ట్ అవుతారు.

సాంకేతికవర్గం పనితీరు: ఒక నటుడిగా కంటే టెక్నీషియన్ గా మంచి మార్కులు సంపాదించుకుంటాడు బండి సరోజ్ కుమార్. ఈ చిత్రానికి హీరోగా మాత్రమే కాక దర్శకుడిగా, కథకుడిగా, ఎడిటర్ గా, మ్యూజిక్ డైరెక్టర్ గా పలు బాధ్యతలు నిర్వర్తించాడు బండి సరోజ్ కుమార్. వీటన్నిట్లో ఎడిటర్ & మ్యూజిక్ డైరెక్టర్ గా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. కట్స్ & ట్రాన్సిషన్స్ సినిమాను వేగంగా నడిపించగా… క్రికెట్ సీన్స్ లో బీజీయం సినిమాకు ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఎలివేషన్స్ కూడా జాగ్రత్తగానే ప్లాన్ చేసుకున్నాడు కానీ.. సినిమాటిక్ లిబర్టీ మరీ ఎక్కువ తీసుకున్నాడు. ఇక దర్శకుడిగా & కథకుడిగా బండి సరోజ్ కుమార్ పనితనం గురించి మాట్లాడుకొంటే..

సరోజ్ కుమార్ సినిమాల్లో లేదా అతడు రాసే పాత్రల్లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ యొక్క ఈగోను సాటిస్ఫై చేయడమే ధ్యేయంగా కొన్ని ఉంటాయి. మోసం చేసే ప్రేమికురాలు కావొచ్చు, అట్రాసిటీ కేస్ అనే ఆయుధాన్ని అనవసరంగా వినియోగించుకునే వ్యక్తి కావచ్చు లేదా కుల కుతంత్ర రాజకీయాలు చేసే క్యాస్ట్ నాయకుడు కావచ్చు, ఇలా సినిమాలోని చాలా పాత్రలకి క్లాస్ పీకుతూ సమాజంలోని చాలా సమస్యలను వేలెత్తి చూపాలనే ప్రయత్నం బాగున్నా.. బోర్ కొట్టేస్తాయి. ముఖ్యంగా జనాల్ని నిల్చోబెట్టి లోవరాజు పీకే క్లాసులు, డైలాగులు కేవలం ఈగో సాటిస్ఫై చేయడం వరకు పర్లేదు కానీ.. జనరల్ ఆడియన్స్ ను మాత్రం అలరించలేదు.

కెమెరా క్వాలిటీ & లైటింగ్ మరీ పేలవంగా ఉన్నాయి. ఎంత ఇండిపెండెంట్ సినిమా అయినప్పటికీ.. కనీస స్థాయి క్వాలిటీ మెయింటైన్ చేయడం అనేది ముఖ్యం, అది కూడా థియేటరికల్ రిలీజ్ అనుకున్నప్పుడు అది కంపల్సరీ. ఆ విషయంలో మాత్రం బృందం విఫలమయ్యారు. కాకపోతే.. ఆర్ట్ డిపార్టుమెంట్ మాత్రం తమకు ఇచ్చిన బడ్జెట్ లో మంచి అవుట్ పుట్ ఇచ్చారు.

విశ్లేషణ: సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణమైన నిజాలను వేలెత్తి చూపడం ఎంత ముఖ్యమో.. ఆ సమస్యలకు సరైన ఎమోషన్ యాడ్ చేసి, మంచి టెక్నికల్ ట్రీట్మెంట్ తో ఆ సమస్యలకు సమాధానం చెప్పడం కూడా అంతే ముఖ్యం. ఆ విషయంలో బండి సరోజ్ కుమార్ గాడి తప్పాడు. అతడ్ని భీభత్సంగా ఫాలో అయ్యే వీరాభిమానులు తప్ప మరెవరూ థియేటర్లలో “పరాక్రమం” చిత్రాన్ని 131 నిమిషాలపాటు భరించడం కష్టమే!

ఫోకస్ పాయింట్: బండి సరోజ్ కుమార్ పరాక్రమ ప్రదర్శన బెడిసికొట్టింది!

రేటింగ్: 1.5/5

Rating

1.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus