‘అంటే సుందారినికీ’ అంటూ ఆసక్తిరేకెత్తించి.. సినిమా వచ్చాక ఉసూరుమనిపించాడు నాని. సినిమా లుక్, నాని యాటిట్యూడ్, హీరోయిన్ నజ్రియా ఇలా కొన్ని విషయాల వల్ల ఆ సినిమా మీద ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి కలిగింది. అయితే అసలు సమయానికి అంటే రిలీజ్ అయ్యాక చూస్తే.. సరైన ఫలితం అందుకోలేకపోయింది. ‘అంటే సుందరానికీ… అంతంతమాత్రం’ అంటూ కామెంట్లు, ట్రోలింగ్‌లు కూడా వినిపించాయి. అయితే ఎప్పటిలాగే ఈ సినిమా ఫలితం అద్భుతం అని నాని అంటున్నాడు.
అయితే ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాత్రం సినిమా ఫలితం తేడా కొట్టడానికి కారణమిదే అంటూ ఓ వీడియో విడుదల చేశారు. నాని ప్రధాన పాత్రలో నటించిన ‘అంటే సుందరానికీ!’ చిత్రానికి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ‘పరుచూరి పాఠాలు’ పేరిట తరచూ తెలుగు సినిమాల సంగతులు చెప్పే పరుచూరి గోపాలకృష్ణ.. కొన్ని సినిమాలను పోస్ట్ మార్టమ్ కూడా చేస్తుంటారు. అలా ఇటీవల ‘అంటే సుందరానికీ’ సినిమా గురించి మాట్లాడారు. ‘అంటే సుందరానికీ’ సినిమా కోసం దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుంది.
అయితే స్క్రీన్‌ప్లే బెడిసికొట్టడం వల్ల సినిమా గాడి తప్పింది. దీంతో ఫలితం ఇబ్బందిపెట్టింది అని చెప్పారు. మతాంతర ప్రేమకథా స్టోరీ లైన్‌తో వచ్చిన ఈ సినిమా ముందుకు సాగే కొద్దీ అసలు పాయింట్‌ను విస్మరించిందని పరుచూరి అభిప్రాయపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ సీన్‌లు, మలుపులు ఎక్కువవడంతో స్క్రీన్ ప్లే సరిగా లేదని అర్థమవుతోందని చెప్పారు. సినిమాలో ఇలాంటి సీన్లు ఎక్కువయితే ప్రేక్షకులు అంతసేపు థియేటర్లలో ఉండటానికి ఇష్టపడరు అని పరుచూరి చెప్పారు.
ప్రేక్షకుడికి కథకు అవసరం లేని కొన్ని సన్నివేశాలు నచ్చవన్న పరుచూరి… గతంలో ఇదే కంటెంట్‌పై వచ్చి విజయం సాధించిన కొన్ని సినిమాలను గుర్తు చేశారు. స్క్రీన్‌ప్లే ఎప్పుడైనా థియేటర్‌లో ప్రేక్షకుణ్ని ఎంతసేపైనా కూర్చోబెట్టేలా ఉండాలి అని అన్నారు. సినిమా ఫలితం ఎలా ఉన్నా… నటీనటులు అద్భుతంగా నటించారని మెచ్చుకున్నారు. నాని నటన సహజంగా ఉంటుందని, ఈ సినిమాలోనూ అంతే స్థాయిలో నటించాడన్నారు. ఇక క్లైమాక్స్‌తో దర్శకుడు మెప్పించారని, చివరి అరగంట సినిమాను బాగా నడిపించారని ప్రశంసించారు.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?