ఇండియన్ సినిమాలో ఇటీవల కాలంలో సెన్సార్ సమస్యలు, కోర్టు వాదనల మధ్య ఉన్న ఏకైక సినిమా ఏదీ అంటే.. అది ‘జన నాయగన్’ అని చెప్పొచ్చు. విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘జన నాయగన్’. సెన్సార్ సర్టిఫికెట్ రాకపోవడం, కోర్టు మెట్లు ఎక్కినా ఫలితం లేకపోవడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కారణాలతోనే ఈ చిత్రం సమస్యల్లో చిక్కుకుందని ఓవైపు వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. సెన్సార్ బోర్డు స్వతంత్రంగా పని చేస్తుందని, ఈ విషయంలో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని పవన్ అన్నారు. ఆ సినిమా సమస్యను సెన్సార్ బోర్డు వద్ద సరిగ్గా పరిష్కరించుకోలేదన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వాన్ని నిందించడం కూడా సమంజసం కాదన్నారు. ఎవరికైనా రూల్ ఒకటే అని చెప్పిన ఆయన తన ‘ఓజీ’ సినిమా విషయంలో ఎదురైన పరిస్థితుల గురించి చెప్పుకొచ్చారు.
ఎన్డీయేలో పవన్ ఓ భాగస్వామిని కాబట్టి ‘ఓజీ’ సినిమాకు తాము అనుకున్నట్లు యు/ఏ సర్టిఫికెట్ వస్తుందని దర్శక, నిర్మాతలు అనుకున్నారట. కానీ ఆ సినిమా ఏ సర్టిఫికెట్ వచ్చింది. దానిని నేను కూడా స్వాగతించాను. సినిమాలో అంత వయలెన్స్ ఉండగా ‘యూ/ఏ’ సర్టిఫికెట్ ఎలా ఆశిస్తున్నారు అని తన టీమ్‌ని అడిగారట పవన్. సెన్సార్ బోర్డు, సర్టిఫికెట్ ఎవరికైనా ఒక్కటే అని చెప్పడం ఇక్కడ పవన్ ఉద్దేశం.
ఇక ‘జన నాయగన్’ జనవరి 9న విడుదలకు సిద్ధం కాగా, చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆ తర్వాత ఈ వివాదం మద్రాసు హైకోర్టుకు చేరింది. అక్కడి నుండి సుప్రీం కోర్టుకి, తిరిగి అక్కడి నుండి హైకోర్టుకు వచ్చింది. అయితే ఇప్పుడు ఈ సినిమాను సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీ మంగళవారం (మార్చి 17) చూడనుందని సమాచారం. వారి రిపోర్ట్ బట్టి సినిమా విడుదలపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.