ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పుడు మాట ఇచ్చి.. ఇప్పుడు రోజుకో మాట మాట్లాడుతున్న బీజేపీ నాయకుల వైఖరి బాధ కలిగిస్తోందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. “బీజేపీకి మద్దతిస్తున్నప్పుడు నాకు రాజకీయ అనుభవం ఉందా? అని ఏ బీజేపీ నాయకుడు అడగలేదు. ఆనాడు ఈ ప్రశ్నను సిద్ధార్థ నాథ్ సింగ్ అడగలేదు. ఓట్లు కావాల్సి వచ్చినప్పుడు నన్ను తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకు తిప్పారు. బతిమిలాడి తెలంగాణ అంతటా పర్యటనలకు పంపారు. ఎన్నికల ముందు ప్రచారానికి అవసరం లేని రాజకీయ అనుభవం నేడెందుకు?” అంటూ ప్రశ్నించారు.”రాజకీయాల్లో నాకు ఏబీసీడీలు తెలియవని.. నేర్చుకుని రమ్మంటున్నారు. ఇంతకు మించిన అవకాశవాదం ఇంకేముంటుంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయింది. మూడేళ్ల కాలంలో నేను ప్రభుత్వాలను ఎన్నడూ ఇబ్బంది పెట్టలేదు. అన్నీ రూల్ బుక్ ప్రకారం జరగాలంటే కుదరదన్న సంగతి నాకు తెలుసు. అందుకే తగినంత సమయం ఇవ్వాలని భావించా.” అని వివరించారు. ఇంకా పవన్ ఏమన్నారంటే..?
అన్ని పార్టీలు అవే చేశాయి.. నోట్ ఫర్ ఓట్ లో కూడా నేడు ఆనాడే మాట్లాడేవాడిని, కానీ ప్రజా సమస్యలు వెనకపడతాయని చూసి చూడనట్లు వ్యవహరించా.. తెలియక కాదు. పైగా తెలుగుదేశం పార్టీ మాత్రమే తొలిసారిగా అలా చేసుంటే బలంగా అడిగేవాడిని, కానీ అంతకు ముందు చాలా పార్టీలు అవే చేశాయి. అందుకే ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వానికి అండగా నిలబడాలనే ఆ విషయంపై కావాలనే స్పందించలేదు.
చిక్కులే మిగిలాయి.. గత మూడేళ్లూ దేశం సమస్యల్లో చిక్కుకుపోవడం మినహా మరేమీ లాభాలను పొందలేదు. అటు నరేంద్ర మోదీ, ఇటు చంద్రబాబులు ఒంటెద్దు పోకడలకు పోతున్నారు. పుణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ గొడవలు, రోహిత్ వేముల ఘటన, నోట్ల రద్దు వంటి ఎన్నో సమస్యలు దేశాన్ని పట్టి పీడించాయి. ప్రతి విషయంలోనూ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదు. నేను బీజేపీని, ఆ పార్టీ నాయకులను ఎంత అర్థం చేసుకుందామని అనుకున్నా, మింగుడు పడట్లేదు. వారు అనుకున్నది చేస్తున్నారే తప్ప, ప్రజల మనోభావాలను గురించి పట్టించుకోవడం లేదు. పదేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదనే కొత్తపార్టీకి అవకాశం ఇద్దామని టీడీపీ- బీజేపీకి మద్దతు ఇచ్చా. ఎన్నికలకు ముందు ఆశలు కల్పించి ఇప్పుడు కుంటిసాకులు చెప్పడం తగదు.
నమ్మకాన్ని నిలుపుకోండి.. రాజకీయ నాయకులు అధికారంలో లేనప్పుడు ఒకలా అధికారం ఉన్నప్పుడు ఒకలా మాట్లాడుతున్నారు. మీరు సన్మానాలు చేయించుకోవచ్చు. ఏదైనా చేయించుకోండి. కానీ నమ్మకాన్ని నిలుపుకోండి. భిన్న మతాలు, కులాలను గౌరవించకుండా ప్రభుత్వాలను నడపలేరు. ప్రజా సమస్యల పరిష్కారంలో టీడీపీ, బీజేపీ మాట మార్చాయి. బీజేపీ నాయకులు వైఖరి బాధ కలిగిస్తోంది. ప్రజల మనోభావాలను వారు లెక్కలోకి తీసుకోవడం లేదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. ప్రజలను చులకన చేసి వెంకయ్యనాయుడు మాట్లాడడం సరికాదు. స్వర్ణ భారత్ ట్రస్ట్ పై పెట్టిన మనసు ఏపీపై పెడితే ప్రత్యేక హోదా వస్తుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.